– ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు
– సంస్కరణలకు వేదికలుగా మార్చేందుకు కృషి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025 సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన కల్చరల్ నైట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా వాటిని మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని వివరించారు. ఖైదీలలో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయని కొనియాడారు. జైళ్ల గోడల మధ్య భారతదేశపు భిన్నత్వం కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలు, భాషలు, మతాలు, సంస్కృతులకు చెందిన ఖైదీలు ఉంటారు. వీరికి ఒకే రకమైన సంస్కరణ విధానం సరిపోదు. అందుకే వారి వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా చర్యలు చేపట్టాలి అని అధికారులకు సూచించారు. జైళ్లను సాంకేతికతతో అనుసంధానించి ఖైదీలకు డిజిటల్ విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునరావాస కార్యక్రమాలు, ఖైదీల ఆరోగ్యం, మానసిక స్థితిని పర్యవేక్షించడానికి కూడా టెక్నాలజీని
సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించామన్నారు. ఖైదీల్లో సంస్కరణ అనేది కేవలం జైళ్ల శాఖ బాధ్యత మాత్రమే కాదని, అది మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.