– నగర కార్పొరేషన్ల అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు నగర పరిశుభ్రతపై ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. సమావేశంలో పరిశుభ్రత, చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సీఎస్ సమగ్రంగా పరిశీలించారు. వివరాలన్నంటినీ ఎప్పటికప్పుడు డాష్‌బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. జీహెచఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, 2650 స్వయం సహాయక బృందాల సభ్యులు మొత్తం 18,557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. నగర పరిధిలో రోజూవారీగా 7800 టన్నుల మేరకు గార్బేజ్ సేకరణ జరుగుతున్నదన్నారు. మున్సిపల్ విభాగం ప్రభుత్వంలో కీలకమని, ప్రజల అవసరాలకు తగినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాలంటూ అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని సీఎస్ హెచరించారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. చెత్త సేకరణ (డ్రై, వెట్ వేస్ట్), ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. నగరంలో పారిశుధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సమయానుసారంగా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచే చర్యలు ముందస్తుగా చేపట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




