– లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
– రాష్ట్ర ప్రిన్సిపల్ కన్జర్వేటర్‌కు తేల్చిచెప్పిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : శేరిలింగంపల్లి జోన్ అర్బన్ బయో డైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్ ప్రమోషన్ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌ను హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వరంగల్ సర్కిల్‌లో పనిచేస్తుండగా ఉన్న ఏసీబీ కేసు విచారణ ముగిసిందని, అయినా తనకు పదోన్నతి కల్పించలేదని పేర్కొంటూ అనిల్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ప్రమోషన్ ఇవ్వలేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం విచారించారు. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.





