– యుద్ధంతో భారత్ కు ఎన్నో సవాళ్లు
– ఆందోళనకరంగా పశ్చిమాసియా పరిస్థితి
– లోక్ సభలో ప్రధాని మోదీ వెల్లడి
న్యూదిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేం ద్ర మోదీ చెప్పారు. లోక్ సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి సోమవారం ఆయన మాట్లాడారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న ప్రధాని మోదీ.. భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధం భారత్ పై ఎన్నో సవాళ్లు తీసుకొ చ్చిందని మోదీ అన్నారు. ప్రజలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోందని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్ లో ఉన్న భారతీయుల రక్ణకు చర్యలు చేపట్టామని చెప్పారు. 24 గంటలూ కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశామని, 3.75 లక్షల మంది భారతీయులు క్షేమంగా వెనక్కి వచ్చారని మోదీ తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని, పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని కూడా చెప్పారు. ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరాకు హోర్ముజ్ జలసంధి కీలకమన్నారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో 60 శాతం ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయని, 65 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పెంచే దిశగా కృషి చేస్తున్నామని, హోర్ముజ్ జలసంధి నుంచి మరిన్ని నౌకలు భారత్ కు వస్తున్నాయని మోదీ వెల్లడించారు. రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయిందని కూడా చెప్పారు. ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందన్న ప్రధాని భారత్ పై మాంద్యం ప్రభావం పడకుండా చూస్తున్నామని, ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ అన్నారు. ఖరీఫ్‌లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తున్నామని, పవర్ ప్లాంట్స్ కు కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గల్ఫ్ సంక్షోభంపై పార్లమెంట్ మొత్తం ఒకే గళం వినిపించాలని ఈ సందర్భంగా కోరారు. పశ్చిమాసియా సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్ కు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు. గ్యాస్ వస్తోంది. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోంది. వాణిజ్య నౌకల్లోనూ అనేకమంది భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి అవసరమైన సాయం అందిస్తున్నాం. భారత దౌత్య కార్యాలయాలు సాధ్యమైనంత తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని దేశాధినేతలతో ఇప్పటికే రెండుసార్లు మాట్లాడాను అని అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. యుద్ధం మొదలైనప్పటి నుంచి 3.75 లక్షల మంది భారతీయులు అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అదేవిధంగా దాదాపు వెయ్యిమంది విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో సీబీఎస్‌ఈ ఇప్పటికే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. పశ్చిమాసియా పరిణామాల విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉంది. అన్ని విధాలా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచుతున్నాం. పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా జరిగేలా నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఇంధనంలో ఇథనాల్ కలపడాన్ని పెంచడం ద్వారా ఏటా ముడి చమురు దిగుమతులను 4.5 కోట్ల బ్యారెళ్ల మేర తగ్గించగలిగాం. ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల సంయుక్త కృషితో ఈ సంక్షోభం వల్ల తలెత్తే సవాళ్లను దీటుగా ఎదుర్కోగలమనే నమ్మకం ఉంది. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులకు సాధ్యమైనంతమేర సాయం అందిస్తూనే ఉంటాం. చర్చలు, దౌత్యం ద్వారా పశ్చిమాసియా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం సాధించేలా అన్ని పక్షాలను ప్రోత్సహిస్తున్నాం అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




