పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం
దిల్లీ, జులై 21: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశం ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. దేశ భద్రతా దళాలు ఉత్సాహంతో విజయం వైపు పయనిస్తున్నాయని, వందలాది జిల్లాలు నక్సలిజం ప్రభావం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. గతంలో రెడ్ కారిడార్‌గా పిలిచే ప్రాంతాలు ఇప్పుడు గ్రీన్ జోన్‌లుగా మారుతున్నాయని, ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. దేశం సైనిక రంగంలో గొప్ప పురోగతి సాధిస్తోందని మోదీ తెలిపారు. సైనిక రంగంలో పరిశోధన, తయారీ, మేక్ ఇన్ ఇండియా ఆయుధాల ఉత్పత్తి బలపడుతోందన్నారు. ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం వంద శాతం లక్ష్యాలను సాధించిందని, కేవలం 22 నిమిషాల్లోనే శుత్రువుల ముంగిళ్లలోకి వెళ్లి మరీ వారి స్థావరాలను నాశనం చేసిందని పేర్కొన్నారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఉత్సాహం
సైన్స్, టెక్నాలజీ రంగం గురించి మోదీ మాట్లాడుతూ ఈ రంగంలో దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకం ఎగిరిన సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్షణం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, పార్లమెంట్ లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఒకే సమయంలో ఈ విజయాన్ని కొనియాడాయని మోదీ అన్నారు. ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక సూచనలు
తొలుత వర్షాకాలం సమావేశాలకు మీ అందరికీ స్వాగతం అని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. దేశంలో వాతావరణం చాలా బాగా అభివృద్ధి చెందుతోందంటూ వ్యవసాయ రంగంలో అభివృద్ధిని కూడా ప్రస్తావించారు. ఈ ఏడాది వర్షాకాలం వ్యవసాయానికి అనుకూలంగా ఉందని, నీటి నిల్వలు గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. ఇది రైతుల ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఈ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వర్షాకాల సమావేశాన్ని ప్రధాని మోదీ జాతీయ గర్వంతో నిండిన విజయోత్సవ సమావేశంగా అభివర్ణించారు.





