ఇరాన్‌ ‌యుద్ద ప్రభావంతో ధరల మోత

– గ్యాస్‌ ‌ధరలు పెరగడంతో పెట్రో ధరలపై ఆందోళన
– ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని వెల్లడించిన కేంద్రం

న్యూదిల్లీ, మార్చి 10:  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌, ‌గ్యాస్‌, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో గ్యాస్‌ ‌ధరలు పెరిగాయి. అలాగే పెట్రో ధరలు పెరుగాయని అంటున్నారు. వీటి ప్రభావంతో నిత్యాసవరాలు కూడా పెరగక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ముఖ్యంగా పెట్రోల్‌ ‌ధరలు పెరుగుతాయనే వార్తలను ఖండించింది. కొంతపాలం పాటు నష్టాలను చమురు కంపెనీలు భరిస్తాయని వెల్లడించింది. రాబోయే 6 నుంచి 8 వారాల వరకు ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్‌ ‌నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు కూడా ప్రస్తుతానికి సరిపోతాయని పేర్కొంది. అయితే గ్యాస్‌ ‌సిలిండర్ల బుకింగ్‌ ‌వ్యవధిని 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ వ్యవధి 21 రోజులు ఉండేది. మనదేశంలో సగటున ఒక కుటుంబం ఏడాదికి 7 నుంచి 8 సిలిండర్లను మాత్రమే వినియోగిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. లాగే రాబోయే ఖరీఫ్‌ ‌సీజన్‌కు సరిపడా ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని ఫెర్టిలైజర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా వెల్లడించింది. అయితే ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, గ్యాస్‌ ‌సరఫరాలో కోత యూరియా ఉత్పత్తులపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 177.31 లక్షల టన్నుల ఎరువులు నిల్వలున్నట్టు తెలిపింది. వాటిల్లో 59.30 లక్షల టన్నుల యూరియా, 25.13 లక్షల టన్నుల డీఏపీ, 55.87 లక్షల టన్నుల ఎన్‌పీకేఎస్‌ ‌నిల్వలున్నాయని పేర్కొంది.

ఇంధన ధరలు దిగి వస్తాయి.. త్వరలోనే ఇరాన్ ‌యుద్ధం ముగుస్తుంది: ట్రంప్‌

వాషింగ్టన్‌,‌మార్చి10: ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతుందని,వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్‌ ‌కొంత మెత్త బడ్డారు. వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇరాన్‌ ‌కూడా గట్టి హెచ్చరికలు చేయడంతోనో ఏమో యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందని అన్నారు. ఇరాన్‌ ‌యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఇరాన్‌ ‌విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామని,  ఇరాన్‌పై దాడిని, మధ్యప్రాచ్యంలోని చెడును వదిలించడానికి అమెరికా చేసిన విహారయాత్రగా ట్రంప్‌ అభివర్ణించారు. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగానే ఉంటుందని తెలిపారు. మియామి గోల్ఫ్ ‌క్లబ్‌లో రిపబ్లికన్‌ ‌చట్ట సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్‌ ‌ప్రసంగించారు. ’ఇరాన్‌ ‌యుద్ధం ఈ వారంలోనే ముగుస్తుందా’ అనే ప్రశ్నకు ట్రంప్‌ ‌స్పందిస్తూ.. ’లేదు. కానీ త్వరలోనే ముగుస్తుంది’ అని జవాబిచ్చారు. ’మా సైనిక లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా పెద్ద అడుగులు వేస్తున్నాం. ఇరాన్‌లోని బలగాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. అలా చేస్తే ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తాం’ అని ట్రంప్‌ ‌హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడిని పొడిగించేందుకు ఇరాన్‌కు తగినంత సామర్థ్యం లేదు కాబట్టి, యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని ట్రంప్‌ ‌పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్‌ ‌దాడిలో ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ ‌నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎంపిక చేయడం పట్ల తాను చాలా నిరాశ చెందానని, అయితే కొత్త సుప్రీం లీడర్‌పై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని ట్రంప్‌ ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *