చికిత్స కంటే నివారణే మేలు

– ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం
– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు
– యోగా సెషన్స్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా.. చికిత్స కన్నా నివారణే మేలు అనే థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ను గచ్చిబౌలి స్టేడియం నుంచి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి యోగా చేశారు. అనంతరం ఆయుష్ విభాగం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు పరిశీలించారు. యోగ కార్యక్రమంలో మంత్రి దామోదర్ మాట్లాడుతూ ఈ రోజు వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, చికిత్సకంటే నివారణే మేలు అనే లక్ష్యంతో ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భారత దేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగ అని చెప్పుకోవాలి.. ఇది కేవలం వ్యాయామం కాదు.. సంపూర్ణ జీవన విధానం.. యోగ సాధన ద్వారా శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది అని తెలిపారు. ప్రస్తుతం మారుతున్న, వేగవంతమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు మానసిక ఒత్తిడి తగ్గి జీవన నాణ్యత పెరుగుతుందని చెప్పారు. నిత్యం యోగా సాధనతో ఎన్‌సీడీల బారినపడకుండా ఉంటారన్నారు.

చికిత్సతోపాటు రోగ నివారణకు సమాన ప్రాధాన్యత

ప్రభుత్వం చికిత్సతోపాటు రోగ నివారణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నామని, 46 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు సుమారు 30 రకాల పరీక్షలతో కూడిన సమగ్ర ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని, వివరించారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు హెచ్‌పీవీ టీకా పంపిణీ చేస్తున్నామని, ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి హెల్త్ కార్డులను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. కల్తీ, నాసిరకం ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు 145 పాలీక్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, బాల భరోసా కార్యక్రమం ద్వారా అయిదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించి శారీరక, మానసిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య సేవలను హాస్పిటల్స్ నుంచి నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామన్నారు. యోగ, నేచురోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేసి ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 750 మంది యోగ శిక్షకులను నియమించి రోజువారీ యోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే దాదాపు పది లక్షల మందికి యోగను పరిచయం చేయగలిగామని అన్నారు. యోగ విద్యను ప్రోత్సహించేందుకు బీఎన్‌వైఎస్ కోర్సుతోపాటు పీజీ కోర్సులను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యంగా ఉండడం ఆప్షన్ కాదు.. ఆవశ్యకం అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. మనం ఎంత ధనవంతులమైనా ఆరోగ్యం లేకపోతే అన్నీ వృధానే అన్నారు. పతి ఒక్కరూ యోగా.. లేదా మరేదైనా శారీరక వ్యాయామాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని మంత్రి దామోదర్ సూచించారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది.. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్‌బాబు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, వెయ్యిమందికి పైగా విద్యార్థులు, యువత, యోగా బోధకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *