– యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి
– ప్రభుత్వ ఏర్పాటులో ’యూత్‘ సేవలు మరువలేనివి
– ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 10: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు కృషిచేస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఏఐసిసి సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిలు తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిస్ఠానంపై ఒత్తిడి తెస్తామని వారు భరోసా కల్పించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రజల సమస్యలపై పోరాడే ధైర్యం, సమాజానికి సేవ చేయాలనే తపన కార్యకర్తల్లో ఉందంటూ ఇదే విశ్వాసం ఎప్పటికీ ఉండాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో యూత్ కాంగ్రెస్ పాత్ర ఎనలేనిదన్నారు. దేశంలో నిరంకుశ పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి యువత త్వరలో చరమగీతం పాడి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలపై పదేళ్లుగా యూత్ కాంగ్రెస్ నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిరదన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి చెందిన ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీతో విజయాన్ని అందించేలా యువజన కాంగ్రెస్ నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ కష్టపడిన ప్రతి ‘యూత్’ కార్యకర్తకూ తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందన్నారు.
ప్రజా సమస్యలతోపాటు పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ఐవైసీ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువజన కాంగ్రెస్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ బలోపేతానికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ కృషి అభినందనీయమన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో సుమారు 1500 మోటార్ సైకిళ్లతో వైట్‌హౌజ్ నుండి కొత్త బస్టాండ్, శంకర్ విలాస్ సెంటర్, పాత బస్టాండ్, పిఎస్‌ఆర్ సెంటర్ మీదుగా పార్టీ జిల్లా కార్యాలయానికి యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహర్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి, గుర్రం శ్యాంచరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.శ్రావ్య సుధీర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. సమావేశంలో అంబేద్కర్, నవీన్‌చారి, పట్టణ అధ్యక్షుడు అంజత్ అలీ, మాజీ కౌన్సిలర్లు బైరు శైలేందర్, బాలుగౌడ్, రవి, పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శిగ నజీర్, వలి, సమీర్, నరేష్, అనిల్, శివ, అశోక్, ఎల్లేష్, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





