– ఆర్ అండ్ బీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలంటూ ఇప్పటికే గుర్తించిన ఏరియాలలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విజన్-2047కు అనుగుణంగా రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు, పురోగతిపై రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. సమస్యలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగ్ రోడ్ అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని, ఆ రోడ్లను హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిందేనన్నారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హాస్పిటల్స్ భవనాల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


