స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు పిలుపు
– కరీంనగర్‌లో మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో చర్చలు
– అభ్యర్థుల ఎంపిక మొదలైందన్న అధ్యక్షుడు

కరీంనగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సంసిద్ధులు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ దిశానిర్దేశం చేశారు. ‘స్థానిక’ ఎన్నికలకు సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేలా కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో కరీంనగర్‌లో బుధవారం జరిగిన చర్చలలో పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజలలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందంటూ వార్డు మెంబర్‌, జడ్పీటీసీస్థాయి వరకు అన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని, గతంలో బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అదేవిధంగా కొనసాగిస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా పథకం పేరును మార్చి తమ కీర్తిగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇటీవల కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గించడం చారిత్రక నిర్ణయం అని వ్యాఖ్యానిస్తూ ఈ నిర్ణయంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని సూచించారు.

అభ్యర్థుల ఎంపిక మొదలైంది

మీడియాతో రామచందర్‌ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలైందన్నారు. ముందు జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించాలని, ఏకగ్రీవంగా ఉన్నచోట బి.ఫాం ఇవ్వాలని నిర్ణయించామని, వార్డు మెంబర్‌ నుండి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. అత్యధిక స్థానాలను సాధిస్తామన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌. కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను దెబ్బతీసిందని, నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోందని, ఉచితంగా బియ్యం అందిస్తోందని, గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతున్నదని వివరించారు. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. హైకోర్టు ఆదేశించినందునే తప్పనిసరై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇష్టం లేకపోయినా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహిస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిందని, ఈ ప్రాజెక్టు మొత్తంపై విచారణ చేయాల్సి ఉండగా మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం చేయడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని, పార్టీని వీడేటప్పుడు రాజీనామా చేయాలన్నదే తమ అభిమతం అని ఆయన అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *