– కార్మికుడు సదానందం మృతి
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 12: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతిచెందాడు.
కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం కంపెనీలో ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో పైపు పగిలి కార్మికుడి తలకు బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సదానందం 20 ఏళ్ల క్రితం గోదావరిఖని నుండి బదిలీపై పెద్ద కందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీకి వచ్చి ఆలేరులో నివసిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ప్రమాదంపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో సదానందం మృతదేహాన్ని చూసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..
కంపెనీలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని, యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కంపెనీలో యంత్రాలను పర్యవేక్షించి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని కంపెనీ యజమాన్యం ఆదుకోవాలని కోరారు, ఈ ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.





