భ‌వ‌న నిర్మాణానికి ముందస్తు ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి

– ఈ ప‌రీక్ష‌లు లేక‌పోతే భ‌వ‌నాలు కూలిపోతాయి
– జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రాముఖ్య‌త‌ను మ‌ర‌చిపోకూడ‌దు
– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: ఒకప్పుడు హైదరాబాద్‌లో ఒక ప్రముఖ భవనం పేకమేడలా కూలిపోయిన ఘటన మనందరికీ గుర్తుంది. ఆ సంఘటన తర్వాత ప్రతి నిర్మాణానికి ముందు సైట్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేశార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద్ర‌రావు గుర్తు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్‌లో నిర్వహించిన “ఇంపార్టెన్స్ ఆఫ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ & రికమెండేషన్స్” సాంకేతిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ  మున్సిపల్ సంస్థలు కూడా దీనిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించాయి. ఆ సమయంలో త‌న‌ తండ్రి,  అన్న, త‌మ‌ కుటుంబానికి చెందిన డాక్టర్ బాబూరావులు  ఈ సైట్ టెస్టింగ్ పనుల్లో పాల్గొన్నారు. అప్పుడే ఈ ప్రక్రియ ఎంత ముఖ్యమో నాకు స్పష్టంగా తెలిసింద‌న్నారు. ఒక భవనం నిర్మాణానికి ముందు నేల బలం ఎంత ఉంది? భూమి ఎంత బరువును తట్టుకోగలదు? నిర్మాణానికి అవసరమైన సామర్థ్యం ఎంత? అనే విషయాలు జియోటెక్నికల్ పరిశీలన ద్వారా తెలుసుకుంటారు. ఈ పరీక్షలు లేకపోతే భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక డిజైన్లు, భారీ నిర్మాణాలు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో మల్టీ స్టోరీ భవనాలు వేగంగా నిర్మించబడుతున్నాయి. నిర్మాణ ఖర్చు, సమయం రెండూ తగ్గాయి. గతంలో రెండేళ్లు పట్టిన పనులు ఇప్పుడు ఆరు నెలల్లో పూర్తవుతున్నాయి. అయితే ఈ వేగంలో ఒక ముఖ్యమైన  జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రాముఖ్యత అంశాన్ని మనం మర్చిపోవద్దు. చిన్న నిర్మాణం అయినా, పెద్ద నిర్మాణం అయినా ప్రతి నిర్మాణానికి ముందు పూర్తి స్థాయి భూ సంబంధిత పరిశీలన తప్పనిసరిగా చేయాలి. ప్రభుత్వ విభాగాలు, ముఖ్యంగా నిర్మాణాలను నియంత్రించే మున్సిపల్ సంస్థలు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌ను తప్పనిసరి చేసే విధంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి. అలా చేస్తే భవనాల భద్రత, ఆయుష్షు గణనీయంగా పెరుగుతాయి. ఇది ఈరోజు అత్యవసర అవసరం. ప్రతి సంక్షోభం కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. కరోనా సమయంలో మనం డిజిటల్ ప్రపంచానికి అలవాటు పడ్డాం. ఈరోజు మన కార్యక్రమాన్ని వేలాదిమంది ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటోంది. టెలివిజన్‌లలో మనం చూస్తున్న విధంగా క్షిపణులు భవనాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో నిర్మాణ రంగంలో పెద్ద మార్పులకు దారి తీస్తాయి. భవిష్యత్తులో రెండు ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఇంధన రంగంలో పెట్రోల్, డీజిల్ స్థానంలో హైడ్రోజన్, ఎలక్ట్రిక్, సోలార్ వంటి ప్రత్యామ్నాయాలు విస్తరిస్తాయి. అలాగే నిర్మాణ రంగంలో భవనాలు మరింత బలంగా, ఏ విపత్తునైనా తట్టుకునేలా నిర్మాణ‌మ‌వుతాయి కాబట్టి నిర్మాణ రంగానికి చెందిన ప్రతి ఇంజినీర్, అధికారి, సంస్థ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌ను అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలి. దీనిని తప్పనిసరి అంశంగా పరిగణించాల‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *