ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు అనైతికం

– తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడు కప్పాటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తెలంగాణ ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామిక, అనైతిక చర్య అని ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజామునే ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి వారిని భయాందోళనకు గురిచేస్తూ ముందస్తు అరెస్టులు చేయడం, గృహ నిర్బంధం చేయడం దేనికి సంకేతం.. మీరు చెబుతున్న ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమకారుల అసెంబ్లీ ముట్టడి పిలుపుతో సోమవారం ఉదయమే కందుకూరు పోలీసులు పాండురంగా రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ప్రజల గొంతుకను నొక్కడం ద్వారా పాలన సాగించాలనుకోవడం భ్రమ అని ఆయన హితవు పలికారు.

హామీల విస్మరణపై ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిని అరెస్టులు చేయడం ప్రభుత్వ అసమర్థతను సూచిస్తోందన్నారు. అమరవీరుల ఆత్మ బలిదానాల వల్ల, వేలాదిమంది ఉద్యమకారుల పోరాటాల వల్ల సిద్ధించిన రాష్ట్రంలోనే నేడు ముఖ్యమంత్రి, మంత్రులు పదవులను అనుభవిస్తున్నారనేది ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పాండురంగా రెడ్డి కోరారు. ఉద్యమకారుల మనోభావాలను దెబ్బతీస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *