‘ప్రజావాణి’ సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ల బృందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణిని మధ్యప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల బృందం సందర్శించింది. వీటి పని తీరు చాలా బాగుందని, ఇలాంటి విధానాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌లతో భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి గురించి వారు డిప్యూటీ కలెక్టర్లకు వివరించారు. సీఎం ప్రజావాణి సమస్యల పరిష్కార వేదిక అని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం అని మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు.


