పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో అధిష్టానం
పార్టీవర్గాల్లో కొంత గందరగోళం
16న సిఎం బృందం దిల్లీకి… జాబితా ఫైనల్ చేసే అవకాశం
మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది మాసాలైంది. రాజకీయంగా ఇప్పుడా పార్టీకి రాష్ట్రంలో స్థిరత్వం ఏర్పడడంతో మంత్రివర్గ విస్తరణ, పార్టీలోని ఇతర పదవులతోపాటు కార్పొరేషన్ చేర్మన్ పదవులపై దృష్టిపెట్టింది. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలోనే అనేక చర్చోపచర్చలు జరిగాయి. ఏమైతేనేమీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలుడైన మహేష్ కుమార్ గౌడ్‌కు ఆ పదవిని ఇప్పించుకోవడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలకు పార్టీ అండదండలు కూడా తోడైతేనే పాలన విజయవంతంగా ముందుకు సాగుతుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆపార్టీ అధిష్టానం కూడా సిఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకే పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, ఎంఎల్సీ కూడా అయిన మహేష్ కుమార్ గౌడ్ పేరును ఫైనల్ చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామకంతో ఇంతవరకు ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న వారితో పాటు, పార్టీలో సీనియర్ నేతలు ఇప్పుడు ఇతర పదవులపై దృష్టి సారించారు. పార్టీ అధికారంలోకి వొచ్చిన మొదట్లో ఏర్పాటు చేసిన మంత్రివర్గమే తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. అయితే గత కొంతకాలంగా రెండవ విడుతగా మరికొందరు మంత్రులతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులపై పోటీ పెరిగింది. పీసీసీ అధ్యక్షుడి పేరు ఖరారు కావడంతో ఈ పోటీ మరింత తీవ్రమైంది. నాయకులు ఎవరికి వారు ఇటు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ర్రా ప్రభుత్వం 37 కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమించింది కూడా. అయినప్పటికీ ఇంకా దాదాపుగా నలభై మందిని కార్పొరేషన్ చైర్మన్‌లుగా నియమించే అవకాశముందంటున్నారు. ఆర్టీసి కార్పొరేషన్ మొదలు, సివిల్ సప్లై, మూసీ, హెచ్‌ఎండిఏ, రెడ్కో, మెడకల్ ఇన్‌ఫాస్ట్రక్చర్, హాకా, స్టేట్ కార్పోరేషన్, యాదవ, కుర్మ, చేనేతలాంటి పలు ముఖ్య కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమించే అవకాశముంది. వీటితోపాటు హ్యూమన్ రైట్స్ కమిషన్, సమాచార కమిషనర్‌లను కూడా నియమించే అవకాశముంది. ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రైతు కమిషన్ చేర్మన్‌గా మాజీ ఎంఎల్‌ఏ, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బిసీ కమిషన్ చైర్మన్‌గా పీసీసీ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా పార్టీ పదవుల పందేరంపై నాయకత్వం ఒక ధృడమైన అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. దశాబ్ధాలుగా పార్టీనే అంటిపెట్టుకున్న సీనియర్‌లకు ఈసారి అన్యాయం జరుగకుండా చూడాలన్నది అందులో ప్రధానమైంది. అలాగే పార్టీ బలోపేతానికి కృష్టి చేసి, నేటికీ ఏ పదవులు అనుభవించకుండా ఉన్నవారిని దృష్టిలో పెట్టుకోవాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని పదవులను కట్టబెట్టాలన్న ఆలోచనలో పార్టీ వర్గాలున్నాయి. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యువతను కూడా పాలనలో భాగస్వామ్యం చేయలని నాయకత్వం భావిస్తుంది.
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుల్లో విద్యా విషయంలో పట్టున్నవారిని వివిధ రంగాల్లో సభ్యులుగా తీసుకునే ఆలోచన కూడా పాలకవర్గానికి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు కాగా మంత్రులుగా ఈసారి ఎవరికి అవకాశం వొస్తుందన్నది రాష్ట్రంలో ప్రధాన చర్చ జరుగుతున్నది. ఇప్పటికే నలుగురైదుగురు పేర్లు ప్రబలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మంత్రి వర్గంలో తనతోపాటు మరో పదిమంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. మరో ఏడుగురికి మంత్రివర్గంలో చేరే అవకాశంలేకపోలేదు. అయితే ఆ ఏడుగురు ఎవరన్న విషయంలో తర్జనభర్జన జరుగుతున్నది. రాష్ట్ర పార్టీ కూడా దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నది. మంత్రి పదవులు ఎవరికి, కార్పొరేషన్ పదవులెవరికి ఇవ్వాలన్న దానిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. అయితే దానిపైన అధిష్టానం ముద్రవేయించుకునేందుకు ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులు దిల్లీకి వెళ్ళి జాబితాను ఫైనల్ చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే నూతనంగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ వీరికన్నా ముందే అంటే బుధవారం దిల్లీ చేరుకున్నారు.
తాను చేపట్టే పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ కేంద్ర నాయకులను అహ్వానించేందుకు ఆయన వెళ్ళినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కార్పొరేషన్ పదవులు తీసుకోవాలా లేక పార్టీపదవులతో సంతృప్తి పడాలా అన్న మీమాంసలో పార్టీలోని సీనియర్ నాయకులిప్పుడు తలమునకలవుతున్నారు. కార్పొరేషన్ పదవులు తీసుకుంటే కేవలం రెండు సంవత్సరాలే పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత తమ రాజకీయ భవిష్యత్తేమిటన్న ఆలోచనలో పడుతున్నారు. కార్పొరేషన్ పదవీ కాలం అయిన తర్వాత పార్టీలో ఏదైనా పదవి ఇస్తారా లేక పార్టీ పదవిని ముందుగా తీసుకుని తర్వాతే కార్పొరేషన్ పదవులను అడుగాలా అన్న సంశయంలో నాయకులున్నారు. దీనికి తోడు పార్టీ మారిన పదిమంది ఎంఎల్‌ఏల అవస్థ మరోవిధంగా ఉంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వొచ్చిన ఎంఎల్‌ఏ అరికపూడి గాంధీ విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో తమ పరిస్థితేమిటన్న ఆలోచనలో ఫిరాయింపుదారులున్నారు. మొత్తానికి రెండవ విడుత పదవుల పందారమన్నది కాంగ్రెస్ వర్గాను గందరగోళంలో పడేసింది.





