ప్రపంచ యవనికపై తెలంగాణ నిలవాలి

– తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ తెస్తున్నాం
– 1948లో నిజాం నిరంకుశత్వానికి పాతరేశాం
– 2023 డిసెంబర్‌ 7న మరోసారి నియంతృత్వానికి చెక్‌ పెట్టాం
– ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టాం
– రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ తెస్తాం
– ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్నదే ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం.. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదన్నారు. పబ్లిక్‌ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం జాతీయ పతాకాన్ని ఎగురవేసి పాయుధ బలగాల వందనం స్వీకరించారు. అంతకుముందు గ‌న్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర ప్రజలతో పలు అంశాలను పంచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు వచ్చిన ప్రస్థానాన్ని ఆయన స్మరించుకున్నారు. 1948 సెప్టెంబర్‌ 17న ప్రజలు నిజాం నియంతృత్వాన్ని ఓడిరచి ప్రజాస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. అదే రోజు ప్రజలకు స్వేచ్ఛా గాలి అందింది. అణచివేతకు, బానిసత్వానికి ముగింపు పలికారు. ఆ కారణంగా ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని అన్నారు. అదేవిధంగా డిసెంబర్‌ 7, 2023న ప్రజలు మరోసారి నియంతృత్వ పాలనకు చెక్‌ పెట్టి ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారని సీఎం గుర్తు చేశారు. ప్రజల ఆలోచననే ప్రమాణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తప్పయినా దిద్దుకుంటాం, మంచి చేయడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు విద్యతోనే ఉందని సీఎం చెప్పారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల ద్వారా విద్యా రంగంలో నూతన మార్పులు తీసుకువస్తున్నామని, క్రీడలు, నైపుణ్యాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్ర విద్యా పాలసీని తీసుకువస్తామన్నారు.

ప్రజల కోసం ఎన్నో పథకాలు

మహిళా శక్తితోనే రాష్ట్ర ప్రగతి అని పేర్కొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెట్రోల్‌ బంకులు, మహిళా మార్టులు ఏర్పాటు చేశాం. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఆచరణలో ఉన్న ప్రణాళికలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. రైతుల కోసం తీసుకున్న సంక్షేమ పధకాలు రాష్ట్ర చరిత్రలో కొత్త మైలురాళ్లుగా నిలుస్తున్నాయని సీఎం వివరించారు. ఇప్పటివరకు రూ.20,616 కోట్ల రుణ మాఫీ చేసిన విషయాన్ని, ఒకే ఏడాదిలో రూ.1.04 లక్షల కోట్లను రైతుల కోసం ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్‌, బోనస్‌లు, ధాన్యం పూర్తిగా కొనుగోలు వంటి చర్యలు రైతులను ఆదుకుంటున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు. రూ..22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు కేటాయించామని, ఈ ఏడాదిలోనే 4.5 లక్షలకుపైగా పేదలకు సొంత ఇంటి సుఖాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ ధరణి విధానం వల్ల గందరగోళం ఏర్పడిరదని, దాన్ని సరిచేసేందుకు భూ భారతి చట్టం తెచ్చామని సీఎం చెప్పారు. గ్రామాల్లో పాలనా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐదు వేల గ్రామ పాలనాధికారులను నియమించామని వివరించారు. హైదరాబాద్‌ రాష్ట్ర అభివృద్ధికి బలం అని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు వివిధ ప్రణాళికలను రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. మెట్రో రెండో దశ విస్తరణ, గోదావరి నీటి ప్రాజెక్టులు, మూసీ పునరుజ్జీవం వంటి భారీ ప్రాజెక్టులను చేపట్టామని వివరించారు. హైదరాబాద్‌ డ్రగ్స్‌కు గేట్‌వేగా మారడం ఆందోళనకరమని సీఎం పేర్కొన్నారు. ‘ఈగల్‌’ వ్యవస్థ ద్వారా డ్రగ్స్‌ వ్యాప్తిని అరికడుతున్నామన్నారు. అవసరమైతే మరింత కఠిన చట్టాలు తీసుకొస్తాం అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ రైజింగ్‌- 2047

రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ పేరిట విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. మూడున్నర దశాబ్దాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని చెప్పారు. చివరగా సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ప్రయాణం, ఇప్పుడు ప్రపంచ వేదికపై జెండా ఎగరేసే స్థాయికి చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఆ బాధ్యత మాది.. ఆశీర్వాదం ప్రజలది అని అన్నారు. ఈ కార్యక్ర‌మంలో ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి కే.రామ‌కౄష్ణారావు, డీజీపీ జితేంద‌ర్‌, వివిధ విభాగాల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *