– ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ
న్యూదిల్లీ, డిసెంబర్ 19 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ గడువును మరోవారం రోజులపాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఈనెల 25 వరకు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం ప్రభాకర్ రావు వారం రోజుల కస్టోడియల్ విచారణ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే ట్యాపింగ్ కేసులో మరికొన్ని రోజులు విచారణ చేయాలని సుప్రీంకోర్టును సిట్ కోరింది. వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్ట్‌ను ఉన్నత న్యాయస్థానానికి అందజేయడంతో ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణను వారం రోజులపాటు పొడిగింపునకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావును విడుదల చేయాలని, తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు ప్రభాకర్‌రావుకు అనుమతి ఇచ్చింది. కాగా, కొత్త ‘సిట్’ ఏర్పాటుతో ట్యాపింగ్ కేసు మరింత వేగవంతంగా విచారణ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగనుంది. కొత్త ‘సిట్’లో తొమ్మిదిమంది అధికారులు ఉన్నారు. సజ్జనార్‌తోపాటు రామగుండం సీపీ ఆంబరి కిషోర్ జా కూడా ఉన్నారు. గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్ధిపేట సీపీ విజయ్‌కుమార్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితోపాటు రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావుతో కొత్త సిట్ ఏర్పాటు అయింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



