ఏపీకి నీళ్ల తరలింపుపై రేపు పీపీటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాల అక్రమ తరలింపుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ గౌరవ అతిథులుగా పాల్గొననున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రాజ్యసభ, లోక్‌సభ, శాసనమండలి, శాసనసభ సభ్యులతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లకు, నీటిపారుదల రంగ నిపుణులకు, అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందజేశారు. తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ఏర్పడిన పరిణామాలను వివరించేందుకు, ఆ ప్రాజెక్టు మార్పుపై ఎన్‌డిఎస్‌ఏ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేసేందుకు ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేశారు. మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్‌ ల రూపకల్పన, నిర్మాణాలలో ఏర్పడ్డ సాంకేతిక అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పైగా ప్రాజెక్టును మార్చడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం భారీ వడ్డీలతో చేసిన అప్పులు రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిన అంశాన్ని కూడా ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *