– సాహసంతో నదుల్లోకి దిగి పునరుద్ధరిస్తున్న సిబ్బంది
– దక్షిణ డిస్కం పరిధిలో నేలకూలిన 1357 విద్యుత్ స్తంభాలు
– ఖరాబైన ట్రాన్స్ ఫార్మర్లు 280
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగష్టు 28: వరద కారణంగా పలు సబ్ స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వలన పలు గ్రామాల్లో విద్యుత్ పంపిణి వ్యవస్థ స్తంభించింది. తమ సిబ్బంది జోరు వాన, భారీ వరదను సైతం లెక్కజేయకుండా నదులు ఈదుకుంటూ విద్యుత్ స్తంభాలు ఎక్కి మరీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ సందర్భముగా సంస్థ చీఫ్ ఇంజినీర్ల, సూపరింటెండిరగ్ ఇంజినీర్లతో ఈ రోజు గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షం ప్రభావంతో మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖ కు భారీ స్థాయిలో నష్టం జరిగిందని అధికారులు తెలియజేసారు. మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్ని చోట్ల సబ్ స్టేషన్లలో నీళ్లు చేరాయన్నారు. 33 కేవి ఫీడెర్స్ – 11, 11 కేవీ ఫీడర్స్ – 175 , డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్లు 262, విద్యుత్ స్తంభాలు 971 దెబ్బతిన్నాయని మరియు కొన్నివందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ చెడిపోయిందని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాతో పాటు, నల్గొండ, గద్వాల్, యాదాద్రి, సంగా రెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో కూడా నష్టం జరిగిందన్నారు. మొత్తం మీద సంస్థ పరిధిలో వరద ప్రభావానికి 33 కేవి ఫీడెర్స్ – 39, 11 కేవీ ఫీడర్స్ – 296 , డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు – 280, విద్యుత్ స్తంభాలు 1357 దెబ్బతిన్నాయని, వరద ఇంకా కొనసాగుతుండటం వలన నష్టాలు మరింతగా పెరిగే అవకాశం వున్నదని చీఫ్ ఇంజినీర్, రూరల్ జోన్ శ్రీ బాల స్వామి సీఎండీ కి తెలియజేసారు. భారీ వర్షాల వేళ, పండుగ పర్వదినాన కూడా మొత్తం విద్యుత్ అధికారులు సిబ్బంది పని చేసారని, భారీ వరద ప్రభావంతో మెదక్ జిల్లాల్లో 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, సిబ్బంది అహర్నిశలు కృషి చేసి నిన్న రాత్రి వరకు 10 గ్రామాల్లో సరఫరా పునరుద్ధరించారు. భారీ వర్షానికి తోడు, రహదారులు కూడా పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన గ్రామాల్లో రాత్రి కి సరఫరా పునరుద్దరించలేక పోయామని, ఈ రోజు తమ సిబ్బంది రాజి పెట్ గ్రామం లో వున్న నదిలోకి దిగి ఫీడెర్ మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరణ గావించారన్నారు. యావత్ విద్యుత్ సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి, యుద్ధప్రాతిపదికన పునరుద్దరణ పనులు గావించడం వలెనే అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరా అందించగలిగామని, సిబ్బంది పునరుద్ధణ పనులు గావించేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ %డ% మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.



