– మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, జులై 9: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ల్యాబ్‌ను కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్‌లతో కలిసి ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తాను కూడా ప్రాథమిక, ఉన్నత విద్య జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ములుగులో పూర్తిచేశానని, ఆ రోజుల్లో ఎస్టీ హాస్టల్‌లో ఉండి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేదానినని, చదువుపై ఆసక్తితో తాను పిహెచ్‌డి పూర్తి చేశానని చెప్పారు. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి పేదరికం అడ్డు కాదని విద్యార్థులు గుర్తించాలన్నారు. అత్యంత పేద కుటుంబం నుండి వచ్చిన తాను ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించానని రాజకీయ రంగంలో రాణిస్తున్నానంటే తను అభ్యసించిన చదువు ఉన్నత విద్య తనకు ఎంతగానో ఉపయోగపడిరదని అన్నారు. చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సాయం చేయాలని ఉద్దేశంతో ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా పది కంప్యూటర్లను అందజేశానన్నారు. అనంతరం పాఠశాలలో రూ.6లక్షలతో మూడు టాయిలెట్ బ్లాకుల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.చంద్రకళ, సెక్టోరల్ అధికారులు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, గుల్లపల్లి సాంబయ్య, డిఎస్‌ఓ జయదేవ్, మండల విద్యాశాఖ అధికారి వజ్జ తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయిని రaాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



