– ఏపీ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి
– వంగవీడులో జవహర్ ఎత్తిపోతలకు శంకుస్థాపన
– పాల్గొన్న మంత్రులు ఉత్తంకుమార్, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటి
మధిర, ప్రజాతంత్ర, ఆగస్టు 10: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీరు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కోరుతున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మధిర మండలం వంగవీటిలో రూ.600 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా రోజుకు 11 టీఎంసీల నీరు తరలిస్తే నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు 25 రోజుల్లో ఖాళీ అవుతుందని చెప్పారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలవ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తేనే ఇన్ని లక్షల ఎకరాలు సాగవుతోంది.. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టీఎంసీలు తరలించుకుపోతే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బనకచర్లను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఒకవైపు కేంద్రంతో, మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. భద్రాచలం డివిజన్‌లోని గిరిజనుల ఏడు మండలాలను పక్కకుపెట్టాలని నాడు సోనియాగాంధీకి విజ్ఞప్తి చేయగా చట్టంలోంచి ఆ మండలాలను మినహాయించారని గుర్తు చేశారు. తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ కలిసి దొంగచాటుగా ఆర్డినెన్స్ గిరిజనులకు సంబంధించిన రెండు లక్షల ఎకరాలు పోలవరానికి ధారాదత్తం చేశారని ఆరోపించారు. గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్న ఏపీ సీఎం పోలవరం ఎత్తు తగ్గించి రెండు లక్షల ఎకరాలను కాపాడాలని డిప్యూటీ డిమాండ్ చేశారు. గోదావరి ఎగువ భాగాన తమ ప్రాజెక్టులు పూర్తయ్యాక, నికర జలాలు, వరద జలాల వాటా తేలిన తర్వాతే బనకచర్ల ప్రస్తావన తేవాలన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిదింటిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలకు భట్టి సెల్యూట్ చేశారు. జవహర్ జాలిముడి ఎత్తిపోతల పథకం కోసం పదేళ్లపాటు ప్రతి సందర్భంలో అసెంబ్లీలో ప్రస్తావించినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మధిర నియోజకవర్గంలో అయకట్టు చివరి ప్రాంత రైతుల బాధలు భావోద్రేకంతో కూడినవని డిప్యూటీ సీఎం తెలిపారు. నియోజకవర్గంలోని 30 గ్రామాలకు సాగునీరు రావాలంటే మూడవ జోన్ లోని ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండేన్నారు. సాగర్ మూడో జోన్‌లోని నియోజకవర్గం గ్రామాలను సాగర్ రెండవ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు తాను ప్రయత్నించానని చెప్పారు. సర్వే, నిధుల మంజూరు అన్ని పనులు చివరి దశకు చేరిన ఆనాడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అపరిస్కృతంగానే ఉండిపోయిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సుదీర్ఘకాలం పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇపుడు నీటిపారుదల శాఖ మంత్రిగా నియోజకవర్గంలోని గ్రామాలను రెండవ జోన్‌లోకి మార్చి ఈ ప్రాంత ప్రజల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు రూ.600 కోట్లతో 30 వేల ఎకరాలకు సాగునీరందించే జవహర్ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా ప్రతి రెండు మండలాల మధ్యన ఒక ఏరు పారుతుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ నీటి వనరులను వినియోగించుకొని కట్టలేరు, జాలిముడి ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, ఈరోజు జవహర్ ఎత్తిపోతల పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు.





