ప్రిన్సిపాల్స్, ఆర్సీవోలతో పొన్నం జూమ్ మీటింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 : ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఆర్సివోలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాల్స్, ఆర్సీవోలతో గురుకుల కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్స్, టీచర్లు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడద్దంటూ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. పిల్లలకు పోషకాలతో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిందని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, పాఠశాలల్లో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. గురుకులాల్లో ఏ సంఘటన జరిగినా అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు.





