– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నాం
– ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం
– భూ భారతితో రైతుల భూములకు భరోసా
– రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గత పాలకులు పదేళ్లల్లో రూ.8.19 లక్షల కోట్ల అప్పు భారం మోపి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేతూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి శనివారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంపై ఇన్ని అప్పులున్నా ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల వలె ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. అసలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాష్ అని ఇందిరమ్మ ప్రభుత్వం మెప్పులు పొందుతోందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500కే సిలిండరు, రూ.21 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేశామని, గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం రూ.12 వేల చొప్పున ఇచ్చిందని వివరించారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చిందని, కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి నిలబెట్టుకోలేదని, కనీసం ఏడాదికి 2 లక్షల ఇళ్లు కట్టినా ఐదేళ్లల్లో పది లక్షల ఇళ్లు కట్టేవారని, కానీ కమీషన్లే ముఖ్యమని కాళేశ్వరం కట్టారని దుయ్యబట్టారు. ప్రజాపాలనలో తొలి విడతగా రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. జిల్లాలో కలెక్టర్ ఆదర్శ్ సురభి బాగా పనిచేస్తున్నారని అభినందించారు. రైతులకు భూ భారతి చట్టం ద్వారా తమ భూములకు భరోసా కల్పించామని తెలిపారు.
గతంలో వందలో ఒకరిద్దరికే ఇళ్లు ఇచ్చారు : మంత్రి జూపల్లి
ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని గత పాలకులు ప్రజలకు మాట ఇచ్చి వందకు ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారందరూ త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం సొంత ఇల్లు లేదు అని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి స్వయంగా ఫోన్ చేసి మీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయని అడుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ మంత్రి పొంగులేటి ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మాట ఇచ్చారని, ఆ ప్రకారం నియోజకవర్గానికి ఇప్పటికే ఒకసారి రూ.వెయ్యి కోట్లు, మరోసారి రూ.280 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధిపరంగా పాలేరు తర్వాత అంతటి ప్రాధాన్యత వనపర్తికి కల్పించాలని మంత్రిని కోరారు. ఈ ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇందిరమ్మ ఇళ్లు అదనంగా మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 6,127 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరవగా వాటిలో 3565 ఇళ్లకు మార్కవుట్ ఇవ్వగా నేటివరకు 180 చెత్తు లెవెల్ పూర్తి అయ్యాయని, 150 ఇళ్లు రూఫ్ లెవెల్, 1220 బేస్‌మెంట్ లెవెల్ పూర్తి అయి మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ పి.శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





