వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం

– ప్రజల రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు
– మూసీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
– భారీ వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతోపాటు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిసిన ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలు, వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఇరిగేషన్‌, రవాణా, విద్యుత్‌, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో పనిచేసి జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు హైదరాబాద్‌ నగరం నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారి రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వికారాబాద్‌ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల మూసీ నదిలోకి వరద భారీగా వస్తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైనచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మీ ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడిరచారు. మూసీలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ముఖ్యంగా హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాలకు భారీ వరద వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా వస్తున్న వరదను అంచనా వేసి అంతే పరిమాణంలో ఈ రెండు జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు. నీెటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే షెల్టర్‌ హోమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయని, రాబోయే వర్షాల వల్ల చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే లో-లెవెల్‌ కాజ్‌వేల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జలాశయాలు, జల వనరుల వద్ద సెల్ఫీలు దిగకుండా యువతను నివారించాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ టీమ్‌లను, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *