15లోగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

– ఇండ్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్‌
– వరంగల్‌ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
– ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను వచ్చే నెల 15లోగా కేటాయించాలని, ఇందుకు అర్హులైన లబ్దిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో వరంగల్‌ నగర అభివృద్ధిపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో కలిసి వరంగల్‌ విమానాశ్రయం, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, భద్రకాళి దేవస్థానం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఔటర్‌రింగ్‌ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై శనివారం సమీక్షించారు. అంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వమే లబ్దిదారులకు రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి ప్రకటించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారనేది ముఖ్యం కాదని, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే ప్రధానమని అన్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా వాటిని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇసుక, చెల్లింపులు, లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని హౌసింగ్‌ కార్యాలయంలో త్వరలో ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసి ప్రతి మండలంలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ఆలోచనకనుగుణంగా చరిత్రాత్మక వరంగల్‌ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్‌ నగరాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. వరంగల్‌ అభివృద్దికి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన డి.పి.ఆర్‌. టెండర్‌, పనులు ప్రారంభించడానికి, పూర్తి చేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని సూచించారు. వరంగల్‌ ప్రాంత చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్ట్‌ కల త్వరలో సాకారం కానుందని, అవసరమైన భూ సేకరణ యుద్ధ పాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని రెండు రోజుల క్రితం రూ.205 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సంబంధించి అక్కడ రాజీవ్‌గాంధీ టౌన్‌ షిప్‌లో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద 1398 మంది లబ్దిదారులను గుర్తించి 863 ప్లాట్‌లు కేటాయించినట్లు తెలపారు. ఈ కాలనీకి సంబంధించి సెప్టెంబర్‌ ఆఖరు నాటికి మౌలిక సదుపాయాల కల్పన పూర్తికావాలని ఆదేశించారు. రూ.4170 కోట్లతో 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌ పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి వీలుగా పనులను విభజించుకొని దశల వారీగా చేపట్టాలని సూచించారు. భద్రకాళి ఆలయ మాడవీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్‌ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయ అభివృద్ది పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జి తో సహా అన్ని పనులు వచ్చే డిసెంబర్‌ కల్లా పూర్తిచేయాలన్నారు. ఆలయంలో యంత్రాల సాయంతో భోజనం తయారీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వరంగల్‌ జిల్లాలో క్రికెట్‌ స్టేడియానికి అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు. హాస్టల్‌లో విధ్యార్ధులకు, హాస్పిటల్‌లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చూడడానికి మండలానికి సంబంధించిన ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని తెలిపారు. ఎంపీ బలరాం నాయిక్‌, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌ రెడ్డి, కె.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, నాయని రాజేందర్‌, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజు సారయ్య, అంజిరెడ్డి, బండ ప్రకాష్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, వివిధ శాఖల రాష్ట్రస్ధాయి ఉన్నతాధికారులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *