కేంద్రం సహకరించకున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నాకూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనకనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో శనివారం ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడలేదని, కేంద్రం అనేక నిబంధనలతో కొర్రీలు వేస్తోందని చెప్పారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.52 లక్షలు కేంద్రం ఇస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తున్నదని తెలిపారు. కేంద్రం నుంచి అరకొర సహాయంపై ఆధారపడకుండానే రాష్ట్రంలో అనుకున్న ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. కేంద్రం సూచించిన విధంగా రీసర్వే కూడా చేపట్టామని, ఇది తుది దశలో ఉందని చెప్పారు. వాస్తవానికి లబ్దిదారుల ఎంపికలో కేంద్ర నిబంధనల కంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే పకడ్బందీగా ఉన్నాయన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు కూడా ఆశించిన స్ధాయిలో పురోగతిలో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దశ దిశ లేకుండా గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించిందని, వీటిలో చాలావరకు అసంపూర్తిగా ఉన్నాయని, కనీస వసతులు కూడా లేవని అన్నారు. వీటన్నింటికీ అవసరమైన మరమ్మతులు చేపట్టి లబ్దిదారులకు కేటాయించబోతున్నామని తెలిపారు. భూ భారతికి సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో ప్రధానంగా సాదాబైనామాలకు సంబంధించినవే ఉన్నాయని, ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని, కోర్టు తీర్పురాగానే పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసి ఉంచామని వివరించారు.

తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలపై పుస్తకావిష్కరణ

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏ, డిప్యూటీ తహసీల్దార్‌ డాక్టర్‌ పైళ్ల నవీన్‌రెడ్డి రచించిన తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం 5వ ఎడిషన్‌ను మంత్రి ఆవిష్కరించారు. పుస్తక రచయిత నవీన్‌రెడ్డిని అభినందించారు. మూస పద్దతిని వదిలి సరికొత్త ఆలోచనా విధానంతో ప్రస్తుత పోటీ పరీక్షలకు అనుగుణంగా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *