పదేళ్లు పత్తా లేరు..

– ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా?
– పేదోళ్లకు రేషన్ కార్డు ఇవ్వనోళ్ళు ఓట్లడిగేందుకు వస్తున్నారు
– ముంచింది ‘కారు’ సర్కారు.. గట్టెక్కించేది ‘హస్తం’ ప్రభుత్వమే!
– ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి

ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: పదేళ్లపాటు ప్రజలను గాలికొదిలేసి ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి ఓ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా? అంటూ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2, 22, 23, 24, 26, 27వ వార్డుల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన ప్రసంగం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. బీఆరఎస్ పదేళ్ల పాలనలో అర్హులకు సంక్షేమం దరిచేరకుండా మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ఫామ్‌హౌస్‌లకే పరిమితమై గాలి మోటార్లలో తిరిగిన నాయకులకు ఈ గల్లీల్లో డ్రైనేజీలు పొంగుతుంటే, ఇళ్లు మునుగుతుంటే ఏనాడైనా కనిపించాయా అని నిలదీశారు. రాజీవ్ గృహకల్ప వాసులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని వారు ఇవాళ ఎన్నికల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, అదీ కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పారు.

ముంపు కష్టాలకు రిటైనింగ్‌తో చెక్

మాట ఇస్తే మడమ తిప్పే అలవాటు తనకు లేదని మంత్రి పొంగులేటి అన్నారు. జూన్‌కల్లా కరకట్ట పూర్తి చేసి మీ ముంపు కష్టాలు తీర్చి తీరుతా అని మరోమారు హామీ ఇచ్చారు. రూ.690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందని, రాజీవ్ గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు అద్దడంతోపాటు ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కలిపి సుమారు రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, ఏదులాపురాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *