పదేళ్లు పాలించి ‘పట్టా’ ఇవ్వని దొరలు

– అధికారం మనది.. అభివృద్ధి చేసేది మనమే..
– ప్రతిపక్షాల మాయమాటలపై మంత్రి పొంగులేటి నిప్పులు

పాల్వంచ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు.. పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ ‘దొర’లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్వంచలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగిచారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిగా మీ శీనన్న.. మీ వాడు. కత్తి ఒకరి చేతికి ఇచ్చి యుద్ధం చేయమంటే నేను చేయలేను. ప్రభుత్వం మనదైనప్పుడే అభివృద్ధి సాధ్యం. ఓట్ల కోసం వచ్చే రకరకాల వ్యక్తుల ‘సొల్లు పురాణం’ నమ్మకండి. అధికారం లేని వారికి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. హస్తం గుర్తును గెలిపిస్తే మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పారు.

పదేళ్ల అన్యాయానికి చరమగీతం పాడదాం

పదేళ్లుగా నా పేద చెల్లెమ్మలు ఇందిరమ్మ ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆనాడు పట్టించుకోని వారు నేడు మీ ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలు, అస్తవ్యస్తమైన రోడ్లే వారి అసమర్థతకు సాక్ష్యం. సర్వే నంబర్ 727 భూ సమస్యను ఏళ్లతరబడి ఎందుకు గాలికొదిలేశారు అని ప్రశ్నించారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, సాగులో ఉన్న ప్రతి నిరుపేదకు పట్టా ఇచ్చే బాధ్యత నాది అని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

మాయ మాటలకు కాలం చెల్లింది

రంగులు మార్చే నాయకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. పాతికేళ్లుగా ఎన్నికల్లేక వెనుకబడ్డ పాల్వంచకు నిధుల ప్రవాహం రావాలన్నా, ఇళ్ల పట్టాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన సీపీఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మంత్రి విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *