– మూడున్నరేళ్ల తర్వాత సంగతి దేవుడెరుగు..
– ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవండి
– కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి ఎదురుదాడి
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడుసార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ కాలేదు.. నీ వల్ల అవుద్దా.. బచ్చాగాడివి.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుద్దేశించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తంతే గారెల బుట్టలో పడినట్టు లక్కీ లాటరీలో మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరులో మళ్లీ ఎలా గెలుస్తారో చూద్దామని తెలంగాణ భవన్‌లో మంగళవారం భద్రాచలం నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల భేటీలో కేటీఆర్ అన్నారు. దీనికి మంత్రి పొంగులేటి ఘాటుగా జవాబిచ్చారు. ఎదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేదిక మీద నుంచి నాటి ప్రబుద్ధులను అడుగుతున్నా.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని.. పెదోడికి ఇల్లు కట్టించి ఉంటే మీకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని హితవు పలికారు. బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజలు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. వారి సోదరి, బిడ్డ సమస్యను సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ట్విట్టర్ టిల్లు మాట్లాడుతున్నారు.. మీ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి చూపించు అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




