– తొలగిన కోర్టు స్టే.. దరఖాస్తులకు త్వరలో మోక్షం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సాదాబైనామాలపై ఉన్న స్టేను హైకోర్టు మంగళవారం తొలగించిందని, ఇది లక్షలాదిమంది పేదల కలలను సాకారం చేస్తుందని అన్నారు. సాదాబైనామాల విషయంలో గత ప్రభుత్వం పేదలను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారు కానీ 2020 ఆర్‌ఓఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపలేదన్నారు. ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయని, దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషిచేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందని ఆయన తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళాఖాతంలో కలిపేశామని, దేశంలోని 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి భూభారతి -2025 చట్టాన్ని రూపొందించామని తెలిపారు. రోల్ మోడల్‌గా నిలిచిన ఈ భూభారతి చట్టం మేరకు రైతన్నల, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులు నిర్వహించగా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలపారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపించే తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని పొంగులేటి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




