– పీసీ ఘోష్ నివేదికతో కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి బహిర్గతం
– అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి
– రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి
ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ఎన్నికల ముందు రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని తాము చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై 15 నెలల విచారణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ 665 పేజీల నివేదిక ఇచ్చారు.. కాళేశ్వరం అవకతవకలు అందులో రుజువయ్యాయి. అక్రమంగా దోచుకున్న డబ్బులు మళ్లీ ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు. ఆ డబ్బు తీసుకుని బీఆర్‌ఎస్ రెండు చెంపతూ చెళ్లుమనిపించాలి అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం రెండుచోట్ల రూ.3.30 కోట్ల విలువైన పీఆర్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదిక వద్ద నూతన రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇంకా మూడు విడతల్లో మరిన్ని ఇళ్లు ఇవ్వబోతున్నామన్నారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ అభద్రతకు గురికావద్దని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వానికి లభించాలని కోరారు. రాష్ట్రంలో 15 కొత్త ఐటీఐ కాలేజీలలో ఒకటి తిరుమలాయపాలెంకు కేటాయించామని, 30 పడకల హాస్పిటల్‌ను రూ.26 కోట్లతో 50 పడకలకు ఉన్నతీకరిస్తున్నామని తెలిపారు. మండల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.77.50 కోట్లు కేటాయించినట్టు వెల్లడిరచారు. ధరణి పేదలకు శాపంగా మారడంతో దానిని బంగాళాఖాతంలో పడేసి భూబారతి వ్యవస్థను తెచ్చాం. రెండుసార్లు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు మూడోసారి చెంపచెళ్ల్లుమనిపించారు అని మంత్రి అన్నారు.





