జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్‌

‌- మొత్తంమీద‌ 48.47 శాతం నమోదు
– 2024 సాధార‌ణ ఎన్నిక‌లలో 47.58 శాతం
– షేక్‌పేట డివిజన్‌లో పోలీసుల లాఠీఛార్జి
– పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ ‌శాతం తక్కువగా నమోదయ్యింది. గత 15 రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేసి వోట్లను అర్థించినా వోటర్లు పెద్దగా స్పందించ లేదు. పోలింగ్ ముగిసే స‌మ‌యానికి అందిన వార్త‌ల ప్ర‌కారం 48.47శాతం పోలింగ్‌ ‌నమోదైంది. 2024 సాధార‌ణ ఎన్నిక‌లలో 47.58 శాతం న‌మోదైంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ ‌పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్‌ ‌సమయం ముగిసే నాటికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ వోటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 14వ తేదీన వోట్ల లెక్కింపు చేపట్టనున్నారు. యూసుఫ్‌గూడ మహబూబ్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ‌వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ వోట్ల విషయంలో నిలదీసిన బీఆర్‌ఎస్‌ ‌నేతలపై కాంగ్రెస్‌ ‌నేతలు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీ దౌర్జన్యాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కొన్ని డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా షేక్‌పేట డివిజన్‌ ‌లోని పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ ‌చేయాల్సి వచ్చింది. అక్కడ పోలింగ్‌ ‌బూత్‌లు 4, 5, 6, 7, 8 వద్ద బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వాళ్లు హడావిడి చేయడంతో పోలీసులు వెళ్ళిపోవాలని వార్నింగ్‌ ఇచ్చారు. కానీ, గులాబీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ ఉద్రిక్తత వెనుక స్థానికేత‌రుల అంశం ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికేత‌రులు ‌నియోజకవర్గంలో తిరగకూడదు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రులు, నాయకులు బూత్‌ల వద్దకు వొచ్చి హడావిడి చేస్తూ వోటర్లను ప్ర‌భావితం ‌చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీల‌కు ప‌ని చెప్పాల్సి వ‌చ్చింది. ఒకవైపు వోటింగ్‌ ‌పర్సంటేజ్‌ ‌మందకొడిగా సాగుతుంటే మరోవైపు బస్తీలలో వోటర్లకు డబ్బులు ఇచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, డబ్బులు అందకపోవడం వల్ల కూడా వోటర్లు ఓటింగ్‌కు రావట్లేదని బ‌హిరంగంగా మాట్లాడుకున్నారు.
ఇదిలావుంటే పోలింగ్‌ ‌సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్‌ ‌పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌, ‌రాందాస్‌పై మధురానగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ‌మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్‌ ‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైనట్టు  పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్‌ ‌పోలీసులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియామవళిని గౌరవించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే డయల్‌ 100 ‌ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *