రాజ‌కీయ‌ మంటే ఫ‌క్తు వ్యాపార‌మే!

“గతంలో రాష్ట్రాలలో , కేంద్రం లో కాస్తా సేవ , గీవ ,చేవ ఉన్నవాళ్ళు అధికార పీఠాలు ఎక్కేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే  టెక్నిక్ తెలిసిన సమర్థులైన  వ్యాపారులే రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు.వ్యాపార దక్షతే రాజకీయ దక్షతగా మార్పుచెందింది. అందువల్ల రాజకీయాలు -వ్యాపారం మధ్య  సరిహద్దు రేఖ చెరిగిపోయింది.”
ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త), 
సెల్:9441864514, 
ఇమెయిల్: thirmal.1960@gmail.com

రాజకీయం-వ్యాపారం ఒకటే అని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలగవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న సనాతన ధర్మం ప్రకారం ఆనాడే మనకు చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది.బ్రహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు.ఇందులో పాలకులు పై మూడు వర్గాలు,పాలితులు శూద్రులు అంటే సబ్బండ వర్గాలు. కానీ, పాలకవర్గం అనే మాటకు అర్థం మారిపోయింది. గతంలో వ్యూహకర్తలుగా ఉన్న బ్రాహ్మణు లు,యుద్ధ‌విద్య‌ల్లో  నైపుణ్యం గల క్షత్రియులు, వ్యాపార దక్షత గల వైశ్యులు వేర్వేరుగా ఉన్నా మానసికంగా వారు పాలకవర్గాలు. నేడు సనాతనధర్మం కాస్తా పోయి ఆధునిక ధర్మం వచ్చింది. వ్యూహకర్త, పరిపాల కుడు, వ్యాపారి పాత్ర‌ల‌ను ఒక్క‌రే పోషిస్తున్నారు!!

అప్పుడప్పుడు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేశంలో కొన్ని నిజాలు మాట్లాడుతుంటారు. అందులో ఆయన నోటి నుండి రాలిన ఆణిముత్యం “తెలంగాణా అంటే వ్యాపారం”. ఎన్నికలముందు ప్రజలతో ఆడిన బేరసారాలు ఏమైనా ఉంటే  “అరచేతిలో బెల్లంపెట్టి మోచేతితో నాకించడం లాంటిదే.” ఇక అసలైన వ్యాపారం హంగు,రంగు ఏమైనా ఉందంటే తాత్కాలిక సెట్టింగ్ గ్లోబ‌ల్ సమ్మిట్ లాంటిదే. ఇకపోతే గత రెండేళ్లుగా రేవంత్ రెడ్డి పాలన అటు వాగ్దానాల అమలుకోసం ప్రజలతో అయినా,ఇటు సచివాలయం నిర్ణయాలలోనైనా బేరసారాలదే పైచేయి. రాబడి, పోబడి లెక్కలే ఎక్కడైనా! కాకుంటే,2029 నాటికి కదా ప్రజలతో లావాదేవీలు సెట్ చేయాల్సింది! ఒకవేళ ఇప్పుడే చేద్దామ‌న్నా జనంలో కూడా అవకాశవాదం ముదిరింది. ఎప్పటికప్పుడు సాయం అందించిన చేతుల్ని మర్చిపోయే అవకాశం ఉంది. ఇంకా మూడేళ్ల కాలం ముందుంది. అంత తొందరేముంది? చూద్దాం, చేద్దాం అనే ఒక అభిప్రాయం! అందుకే ఆయన మనస్సు నుండి తెలంగాణా అంటే వ్యాపారం అన్న మాట తన్నుకొచ్చింది. ఆయ‌న కోణంలో చూస్తే ఇది అక్ష‌ర‌స‌త్యమే మ‌రి!!
ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే, గత పుష్కర కాలంగా మోదీ పరిపాలన అంతా అదానీ,అంబానీల చుట్టే చక్కెర్లు కొడుతున్న‌ది. ఇద్దరికే సంపదనంతా దోచి పెడుతున్నారని ప్రతిపక్షాల అరుపులు, కేకలను ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేదు. ప్రజలు కూడా ఇదేం కొత్త మాట కాదుగదా! అని ఎప్పటికప్పుడు సర్దుకుపోతూనే ఉన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసినా, మిత్రధర్మం కింద‌ అప్పులన్నీ సానుభూతి తో రద్దు చేసినా, అప్పుడప్పుడు పార్లమెంటు లో “బేచ్ గయా!”అన్నమాటలు వినిపించినా ఆ భాష మనది కాకపోవచ్చు ననే భావనలోనే ప్రజలున్నట్లు ఉంది. కేంద్రం ట్రంప్ తో బేరసారాలాడినా, ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఆపరేషన్ కగార్ జరిపినా రాజకీయ చర్యలే కానీ, మనకు వ్యాపార దృక్పథం మచ్చుకైనా కనపడ లేదు. అసలు నక్సలైట్లు అనె టోళ్ళు ఇప్పటోళ్ళా? కానేకాదు! వారు ఎప్పటి నుండో నాలుగు తుపాకి కట్టెలు పట్టుకొని అమాయకమైన గిరిజనులతో కలిసి అడవుల్లో జీవిస్తున్నారు. అవకాశవాద జనంలో అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చే రాజకీయ వ్యాపార కళ వాళ్ళకు ఇంకా అబ్బలేదు. పాపం,వాళ్ల‌ మానాన వాళ్ళను వదిలేస్తే మారుతున్న కాలం వెంట వాళ్ళు కొంతకాలానికి మారిపోయోవాళ్లేమో?
     కగార్ పేరుతో నక్సలైట్లను కంగారు పెట్టడం వెనుక పెద్ద వ్యాపార రహస్యమే ఉందన్నారు. పచ్చని అడవుల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద పై ఆశ్రిత పెట్టుబడిదారుల కన్నుపడింది. కనుక పంటిలో రాయిలా? కంటిలో నలుసులాగా ఉన్న నక్సలైట్లు అనేవాళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా చంపేయ‌డ‌మో  కాకుంటే భయపెట్టి తలకింత వెలకట్టి కొనడమో, ఇప్పుడు తక్షణ అవసరం. బేర‌సారాల ప‌ని కేంద్ర ప్రభుత్వం మొద‌లుపెట్టేసింది. ఇక ఎవరేమనుకున్నా మార్చి నాటికి హోంమంత్రి అమిత్ షా నక్సలైట్ క్లియరెన్స్ తో అడవుల్లో ఆదానీ,అంబానీ  వ్యాపారం స‌జావుగా సాగే అవకాశం మెరుగైంది. ఈ విషయంలో ఎవరేమనుకున్నా సమాధానం చెప్పాల్సిన అవసరం లేనేలేదు.ఎందుకంటే రాజకీయం కూడా ఫక్తు వ్యాపారమే కనుక!  మనది ప్రజాస్వామ్య దేశం కనుక నక్సలైట్లే కాదు,అడవుల్లో అదానీ,అంబానీలు స్వేచ్ఛ గా తిరిగే హక్కు కలిగించడం కేంద్రం బాధ్యత కాదా, ఎవరైనా ప్రశ్నించినా ప్రశ్నించవచ్చు. నిలదీసినా నిలదీయవచ్చు!
గతంలో రాష్ట్రాలలో , కేంద్రం లో కాస్తా సేవ , గీవ ,చేవ ఉన్నవాళ్ళు అధికార పీఠాలు ఎక్కేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే  టెక్నిక్ తెలిసిన సమర్థులైన  వ్యాపారులే రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు.వ్యాపార దక్షతే రాజకీయ దక్షతగా మార్పుచెందింది. అందువల్ల రాజకీయాలు -వ్యాపారం మధ్య  సరిహద్దు రేఖ చెరిగిపోయింది.   అంతర్జాతీయ వ్యాపారి ‘ట్రంప్’ ఒకవైపు మన ప్రధాని మోదీ మీద ప్రేమ ఒలకబోస్తూనే, మరోవైపు టారిఫ్ ల మీద టారిఫ్‌లు వేసి బెదిరిస్తుంటే ఆయన తెంపరితనాన్ని చూసి అప్పుడప్పుడు ముచ్చటేసేది. పిచ్చోడనుకున్నారు? మెంటలోడన్నారు? ఎవరేమనుకున్నా ఆయన తగ్గేదేలే. అన్న సినిమా డైలాగ్ లాగా నిలకడగానే నిలబడి ఉన్నారు.పైగా అంతర్జాతీయ శాంతి బహుమతి నోబెల్ తనకెందుకివ్వరని ప్రపంచాన్ని సైతం ఆయన ప్రశ్నించి నివ్వెర ప‌ర‌చిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అంతర్జాతీయ వ్యాపారానికి హద్దులు, సరిహద్దులు ఉండవని ఆయన మరోమారు నిరూపించారు. ఆయనకు చమురంటే మహా ప్రీతి, నీటినుండి ఇంధనం తయారయ్యే వరకు తప్పదు మరి చమురు కమురు వాసనలు.
అప్పుడెప్పుడో అమెరికా ఇరాక్ అద్య‌క్షుడు సద్దాం హుస్సేన్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పి దాడి చేసి చివరకు ఆయనను  ఉరితీసి చంపేశారు. వ్యాపారరహస్యం తెలియక ఆయన పిచ్చివాడిలా చావులో కూడా నవ్వును వీడ‌లేదు. కీలుబొమ్మ ను నిలబెట్టారు. చివరకు అమెరికానే ,తూచ్…ఇరాక్ దగ్గర రసాయనిక ఆయుధాలు లేనేలేవని తేల్చి పారేసింది. అదంతా ఉత్తుత్తి మాటేనంటూ గట్టిగానే చెప్పింది. అయినా జరగాల్సింది, జరిగిపోయింది కదా! ఇక ఇప్పుడు వెనిజులా చమురు పై ట్రంప్ కన్నుపడిందట..!అదే పాత కథ! వెనిజులా అధ్యక్షుడు నేరుగా మాదక ద్రవ్యాలు వ్యాపారం చేస్తున్నాడని చెప్పి త‌న సైన్యాన్ని పంపి రాత్రికి రాత్రి పడకగదిలో ఉన్న వెనివెజులా అధ్య‌క్షుడు మదురో, ఆయన భార్య  సిలియా లను రెక్కపట్టి మరీ ఈడ్చుకొచ్చి అమెరికా జైల్లో వేశారు. రేపోమాపో విచారణ జరిపి ఉరి తీస్తారు. అది వేరే కథ!! దీనికి  ముద్దుగా మన ప్రధాని మోదీ  కగార్ లాగా, ట్రంప్ కూడా “ఆపరేషన్ అబ్జాల్వేట్ రిజాల్వ్” అని ముద్దు పేరు పెట్టేసుకున్నారు. ఇక్కడ చమురే చిచ్చు పెట్టిందని ప్ర‌పంచ‌ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఐకాసలు,సార్వభౌమాధికారం జాన్తానై !సామ్రాజ్యవాదం, ఆధిపత్యం వాదం, అరాచకవాదం రాజకీయంగా మీరే పేరైనా పెట్టుకొండి, మాది మాత్రం ఫ‌క్తు వ్యాపార వాదం అని నిరూపించారు.అంతర్జాతీయ పోలీసు బాస్‌, ట్రంప్!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *