కూల్చివేత‌ల‌పై రాజ‌కీయ‌ దుమారం

– రియ‌ల్ వ్యాపారుల జోలికెళ్ల‌లేదు
– ఇద్ద‌రు మంత్రులు అభాసుపాలు
– భూదాన్ భూముల ధ‌ర‌లు పెర‌గ‌డంతో బ‌డాబాబుల క‌న్ను
– ఒక మంత్రి బంధువు క‌బ్జాలో 31 ఎక‌రాలు?
– ఎక‌రం ఖ‌రీదు రూ.10కోట్లు

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల కూల్చివేతలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఐదు రోజుల క్రితం ఆకస్మికంగా పేదల నివాసాలను కూల్చివేయడం, వారి సామాన్లను బలవంతంగా తరలించగా, ఈ భూదాన్ భూములను ఆక్రమించిన రియల్ వ్యాపారుల జోలికి పోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్యలతో అధికార పార్టీ మంత్రులతో పాటు అధికారులు అభాసుపాలయ్యారు. జిల్లా కలెక్టరేట్ కూతవేటు దూరంలో వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు 147, 148, 149లో 62.7 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు రాళ్లు రప్పలు, గుట్టలుగా ఉన్న ఈ పరిసర ప్రాంతాలన్ని ఇప్పుడు మినీ నగరంగా మారాయి. కలెక్టరేట్, ఖరీదైన  భవనాలు, వ్యాపార సముదాయాలు నిర్మాణం కావడంతో సమీప భూముల విలువలు అమాంతం పెరిగాయి. హిల్స్ ప్రాంతంగా ఉండంతో అక్కడ ఉండడానికి బడాబాబులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేగాక  కలెక్టరేట్ రాకతో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ గజం రూ.లక్ష.. ఎకరం సుమారు రూ.10 కోట్లు పలుకుతోంది. తాము కాపాడిన 31 ఎకరాల భూమి ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.250 కోట్లు ఉంటుందని సాక్షాతూ జిల్లా కలెక్టరే ప్రకటించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మరో 31 ఎకరాలు ఉంది. మొత్తం భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. ఈ భూముల సమీపం నుంచే నాగ్ పూర్ -అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుండటంతో ఈ భూమికి మరింత డిమాండ్ పెరిగింది. ఈ నేపధ్యంలో 12 ఏళ్ల  నుంచి వినోబా కాలనీగా అత్యంత నిరుపేదల నివాసం ఉంటున్న వారిని కోర్టు తీర్పు, భూదాన్ ట్రస్ట్ ఆదేశంతో ఖాళీ చేయించారు. అయితే ఈ భూమి సమీపంలో బడాబాబుల భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు, పట్టా భూములు ఉండటం వల్లనే ఖాళీ చేయించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక బిల్డర్ కి, ఒక కాంట్రాక్టర్ కి, ఒక ప్రజాప్రతినిధికి, పోలీస్ శాఖకు చెందిన ఒక అధికారికి, జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన భూములు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న‌ది. కొందరికి రాజకీయంగా సన్నిహితంగా ఉన్న వారికి మేలు చేసేందుకు పేదల ఇళ్లను కూల్చివేశారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజు వారే అధికారులు, సిబ్బందితో పాటు నిరాశ్రయిలైన బాధితులకు భోజనం, మంచినీటి సౌకర్యం కల్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక పక్క పేదలు తలదాచుకునేందుకు నివాస స్థలాలను ఏర్పాటు చేసుకుంటే మరోపక్క అక్రమార్కులు మట్టి అమ్మకాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు భూదాన్ భూమిగా చెబుతున్న దానిలో దాదాపు 100 అడుగుల మేర గుట్టను తవ్వి మట్టిని తరలించారు మట్టిని తరలిస్తున్న సమయంలో ఏ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు మట్టి తరలింపుపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పేదలు కష్టపడి గూడు నిర్మించుకుంటే ఆక్రమణ పేరుతో బయటకు నెట్టారు.

2024లో ఎదురు తిరిగిన‌ పేదలు 

2024 ఆగస్టు 27న ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ అసిసోయేషన్ నాయకులకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు పోలీసులతో వచ్చి అక్కడి షెడ్లను తొలగించే ప్రయత్నం చేయగా ఆ రోజు పేదలు ఎదురుతిరగడంతో వెనకి వెళ్లిపోయిన విషయం విదితమే. అయితే, జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఇళ్ళను కూల్చివేసిన స్థలం 31 ఎకరాల పరిధిలోనేనని,  మిగిలిన 31 ఎకరాలు ఏమయ్యాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఎందుకు ఆ వైపు చూడటం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు ఇద్దరు భూస్వాములు పేదలకు దానం చేయమని భూదాన్ బోర్డుకు భూమి ఇచ్చారు. దాదాపు 70 ఏళ్ల నుంచి భూమి పంచకుండా నేడు వందలమంది పేదలు  రూపాయి రూపాయి పోగేసి పక్కా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటుంటే వారు ఆక్రమణదారులని భారీగా పోలీసులను మోహరించి కట్టుబట్టలతో ఇళ్ళు నేలమట్టం చేయడం సమర్ధనీయమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక్కడ ఖాళీ చేయించి మరోచోట ఇస్తామని చెప్పడం మరింత విడ్డురంగా ఉందంటున్నారు. సుమారు 62 ఎకరాల్లో కేవలం 31 ఎకరాల గురించి అధికారులు లెక్కలు చెబుతున్నారు. అందులో 10 ఎకరాలు ప్రభుత్వ విద్యా సంస్థలకు అందజేశామన్నారు. మరో 3 ఎకరాల్లో ఇళ్ళు నిర్మించడంతో నేడు కూల్చారు. మిగిలింది 18 ఎకరాలు. ఈ మొత్తానికి అధికారులు ఫెన్సింగ్ వేయించాల్సి ఉంటుంది. ఇప్పటికే 31 ఎకరాలు కబ్జా చేసిన ఓ మంత్రి సన్నిహితులు, ప్రభుత్వ పాఠశాలలు అనుకొని ఉన్న స్థలాలు కబ్జా చేసేందుకు ఫెన్సింగ్ పనిలో ఉన్నారని చర్చ జరుగుతోంది. నాకు తెలియదని రెవెన్యూ మంత్రి అంటుండగా, నాకు సoబంధం లేదని మరో మంత్రి అంటున్నారు. చివరకు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు సబ్ డివిజనల్ రెవెన్యూ  అధికారి బదిలీకి దారితీసింది. సదరు అధికారి ఆక్రమణల తొలగింపు పర్వంలో దగ్గర ఉండి పనులు పర్యవేక్షించారు. కూల్చివేత ఆర్డర్లు ఇచ్చిన పై అధికారులను వదిలేసి ఆర్డర్లను అమలు చేసిన కిందస్థాయి అధికారిని బదిలీ చేయడమేమిటని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మంతోపాటు ఇతర జిల్లాల పోలీసు బలగాలు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, భారీ సంఖ్యలో ఇళ్ళు కూల్చే యంత్రాలు  ఏర్పాటు చేయడం అంటే మాములు విషయం కాదు. కూల్చి వేతల వెనుక ‘షాడో’గా వ్యవహరించింది ఆఫీసరా? పొలిటీషియనా అనే చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎవరి వాటా ఎంత అనేది లెక్కలు వేస్తున్నారు బాధితులు. రూ .కోట్లు రాకపోతే ఎవరు ఇంత రిస్క్ తీసుకుంటారని స్థానికంగా  బలమైన చర్చ నడుస్తోంది. ఏదిఏమైన రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పరిష్కరించేందుకు అన్ని రకాల యంత్రాంగాలను వినియోగిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *