de-registration: 334 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

– బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఈసీ

న్యూదిల్లీ, ఆగస్టు 9: దేశంలో రాజకీయ పార్టీల (poltical parties) జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (election commission) సవరించింది. గుర్తింపు పొందని 334 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడిరచింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్‌ అయి ఉన్నాయి. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. 67 ప్రాంతీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ఇదిలావుంటే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, 65 లక్షల ఓట్లను తొలగించిందంటూ విపక్ష పార్టీలు ఆరోపించాయి. పార్లమెంట్‌ వేదికగా ఆందోళనలు చేపట్టాయి. అంతేకాక ఇటీవల దిల్లీ వేదికగా రాహుల్‌గాంధీ ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఓట్ల కుట్రపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తాజాగా ఇదే అంశంపై ఎన్నికల సంఘం స్పందించింది. బీహార్‌ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(intencive revision)పై రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు గానీ అభ్యంతరాలు సమర్పించలేదని వెల్లడిరచింది. ఓటర్ల జాబితా ప్రకటించిన చోట ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదని పేర్కొంది. అనర్హులైన ఓటర్ల పేర్లనే తొలగిస్తున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *