ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ లో రాజ‌కీయ వేడి

– నాలుగేళ్ల‌లో రెట్టింపై 4ల‌క్ష‌ల‌కు చేరిన‌ జ‌నాభా
– ప‌దిలోపు డివిజ‌న్లు పెరిగే అవ‌కాశం
– మ‌రో రెండు నెల‌ల్లో ముగియ‌నున్న పాల‌క‌వ‌ర్గ గ‌డువు
– మంత్రి తుమ్మ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం
– వివిధ పార్టీలు అప్ర‌మత్తం

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై రాజకీయ చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాల్టీల ఎన్నికలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, మధిర , వైరా , కల్లూరు, సత్తుపల్లి , భద్రాద్రి కొత్తగూడెం లోని ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాల్టీలో విజయం సాధించి కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగించింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ తో పవర్ షేరింగ్ చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు అనుసంధానంగా ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై పొలిటికల్ హీట్ నెలకొంది.
2021లో ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు జరగ్గా.. అప్పటి జనాభా, ఓటర్ల లెక్కల మేరకు నగరాన్ని 60 డివిజన్లుగా విభజించారు. మొత్తం గా 2,81,387 మంది ఓటర్లు ఉన్నారు. 60 డివిజన్లలో 57 డివిజన్లు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో (మంత్రి తుమ్మల నాగేశ్వరరావు), మరో మూడు పాలేరు నియోజవర్గంలో (మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి) పరిధిలో ఉన్నాయి. అయితే దాదాపుగా నాల్గున్నర ఏళ్లలో ఖమ్మం నగరం అభివృద్ధి చెందడంతో పాటు జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. సుమారు 4 లక్షవరకు ఉంటారని ప్రాథమిక అంచనా. డివిజన్ల సంఖ్య పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఓటర్లకు అనుగుణంగా పది లోపు డివిజన్లు పెరుగుతాయని చర్చ జరిగింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా  జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పాటు ఖమ్మం కూడా ఎన్నికలు నిర్వహించాలని  ”మంత్రాంగం” చేసిన్నటికి డివిజన్ల సంఖ్య పెంపు, అధికారుల అనుమతి, సన్నద్ధత వంటి కారణాలు అవరో|ధంగా మారాయి. మరో రెండు నెలల్లో ఇక్కడి పాలకవర్గం గడువు ముగుస్తోంది. గత ఎన్నికల రిజర్వేషన్ అయిన జనరల్ మహిళ క్యాటగిరి ఈసారి కూడా అదే కేటయించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రిజర్వేషన్  సందర్బంగా ఖమ్మం కూడా ప్రకటించిన విషయం విదితమే. గతంలో మేయర్ పాపాలాల్(ఎస్ టి రిజర్వేషన్), ప్రస్తుత మేయర్ నీరజ(జనరల్ మహిళ) బి.ఆర్.ఎస్. పార్టీ కి చెందినవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేయర్ నీరజ కాంగ్రెస్ లో చేరారు.

2021లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 10, సిపిఐ, సీపీఎం, బీజేపీ(1), రెండు, మూడు కార్పొరేటర్లు ఉండగా మిగిలిన వారంతా బిఆర్ఎస్ వారే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలసల పర్వం ఊపందుకుంది. మేయర్ మార్పు ఉంటుందని కాంగ్రెస్ లో ఉన్న వారు ఆ తర్వాత వచ్చిన కార్పొరేటర్లు భావించారు. అందుకు విరుద్దంగా బిఆర్ఎస్ మేయర్ ను కొనసాగించారు. ఈ అంశంలో కీలక నేతల తీరును తప్పుబడుతూ పలువురు కార్పొరేటర్లు కలత చెందారు. కాంగ్రెస్ కు మెజార్టీ కార్పొరేటర్లు ఉన్నా పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య పలు కార్యక్రమాల సందర్బంలో విభజన రేఖ స్పష్టంగా కనబడుతోంది. కార్పొరేషన్ నిధుల కేటాయింపులోనూ ఆ వివక్ష కొనసాగుతోంది. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మంత్రి అజయ్ కుమార్ ఒత్తిడిలను ఎదుర్కొని కాంగ్రెస్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు మూడు రంగుల జెండా వదల్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత, కొత్త కలయికతో ప్రతి డివిజన్ నుంచి ముగ్గురు, నలుగురు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఎన్నికల నాటికి టికెట్ల కేటాయింపు అంత ఈజీ కాకపోవచ్చు. ఇప్పటికే డివిజన్ల వారీగా నాయకుల ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. యువ నేత కోట‌రీ ప్రత్యేక పాలన నడుస్తోంది. రంగులు మార్చిన వారు పోను మిగిలిన కారు పార్టీ కార్పొరేటర్లు సమిష్టిగానే ప్రభుత్వ వ్యతిరేక పోరు బాట లో కనిపిస్తున్నారు. సిపిఐ, సీపీఎం రెండు, మూడు కార్పొరేటర్లు సాదించినప్పటికీ వాటి సంఖ్య పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. సీపీఎం కొన్నాళ్లుగా స్థానిక సమస్యలపై పోరాడుతోంది. సిపిఐ కొత్తగూడెం మేయర్ ఊపుతో ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఒక కార్పొరేటర్ ఉన్న బీజేపీ ఆ సంఖ్య పెంచుకునేందుకు చాప కింద నీరులా వివిధ రకాల హిందుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బలంగా ఉన్న టీడీపీ కి ఎన్నికలప్పుడు పార్టీ బి ఫారం ఇవ్వడం సమస్యగా తయారవుతోంది. తమకు బలం ఉన్నచోట న్యూ డెమోక్రసీ, మాస్ లైన్ పోటీ చేయనున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ 57 డివిజన్లు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి(మంత్రి తుమ్మల నాగేశ్వర రావు), 3 డివిజన్లు పాలేరు నియోజకవర్గం (మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి) పరిధిలో ఉన్నాయి. అత్యధిక భాగం ఉన్న మంత్రి తుమ్మలకు ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానున్నాయని రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *