– పోలీసుల పక్షపాత వైఖరి
– డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులతోపాటు పోలీసుల పక్షపాత వైఖరిపై డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా చండూరులో బీజేపీ¾ నాయకులపై జరిగిన హత్యాయత్నాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దాడిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలైనప్పటికీ పోలీసులు నిందితులకు అనుకూలంగా బలహీనమైన సెక్షన్లతో కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై నిరసన వ్యక్తం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం పోలీసుల పక్షపాతానికి నిదర్శనమని మండిపడ్డారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి పట్ల డీఎస్పీ అనాగరికంగా వ్యవహరించిన తీరును ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డీజీపీని బీజేపీ¾ బృందం డిమాండ్ చేసింది. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, సీనియర్ నాయకులు మారుతీ కిరణ్, రామకృష్ణ, సీనియర్ న్యాయవాది ఆంథోనీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




