పోలీసు సంక్షేమానికి ఎంతో చేశాం

– పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమానికి మీరు చేసిందేమీ లేదు
– ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్
– లక్షమంది పోలీసుల తరపున మాట్లాడుతున్నా: హరీష్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: వడ్డించే వాడు మనవాడైతే లడ్డు ఎక్కడున్న వస్తుంది అంటరు కానీ పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు.. పోలీసులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు నిరసించారు. రాత్రింబవళ్లు కష్టపడే వారు పోలీసులు.. ఈ రాష్ట్రం కోసం, సమాజం కోసం ఎంతో పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ పోలీసులను ఎంతో గౌరవించారని, 40, 50వేల పోలీసు పోస్టులు భర్తీ చేశారని, కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేశారని, ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏడు టీఏ బిల్లులు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నయన్నారు. పోలీసుల భద్రత పథకాన్ని రూ.లక్షకు మాత్రమే పరిమితం చేశారని, కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో ఇచ్చి కొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టారని ఆక్షేపించారు. లక్షా 30వేల మంది పోలీసుల తరపున తాను మాట్లాడుతున్నానన్నారు. గత ఏడాదికంటే రూ.400 కోట్ల బడ్జెట్ ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు మంత్రినుంచి ఎలాంటి సమాధానం లేదని, పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై భరోసా ఇవ్వనందుకు, 17వేల ఖాళీల భర్తీపై చెప్పనందుకు, పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు, బీసీల ఆత్మగౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు, బీసీ సబ్ ప్లాన్ నిదుల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు నిరసనగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామన్నారు.

వచ్చిందే వాకౌట్ చేయడానికన్నట్టు ఉంది : మంత్రి శ్రీధర్‌బాబు

బీఏసీలో సభ ఎక్కువ రోజులు నడపాలంటూ డిమాండ్ చేసే వీరు సభను ఇలా వాకౌట్ చేసి వెళ్ళడం అర్థమేంటి అని బీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్‌పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. ఇలా చేయడం కరెక్టు కాదని చురకలంటించారు. ‘బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ.. పదేళ్ల పాలనలో వారికి ఒరిగిందేమీ లేదు.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు., ఏ అంశంలోనూ ఆ సభ్యులకు చిత్తశుద్ధి లేదు.. అందుకే ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే వాకౌట్ చేస్తున్నారు. వాకౌట్ చేస్తే రోజంతా చేయాలి.. కానీ ఇలా బయటకెళ్లి అలా హౌజ్‌లోకి వస్తున్నారు.. ప్రతి విషయాన్ని ప్రజలు గమిస్తున్నారు.. అది మర్చిపోవద్దు అని హెచ్చరించారు. బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు మేం బీసీ రిజర్వేషన్లపై ఓ అడుగు ముందుకేస్తే వాళ్ళేమో అక్కసుతో పది అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని విమ‌ర్శించారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమమా అని నిలదీశారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంటే ఏం చేయడంలేదంటూ విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రవాణా శాఖలో పారదర్శకతకు పెద్ద పీట వేసేలా, పౌరులకు మరింత వేగవంతమైన సేవలు అందేలా టెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పుడేమో మేమేం చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వాళ్లతో మాట్లాడేందుకు ఒక్కరంటే ఒక్కరూ వెళ్లలేదు. అలాంటి మీరా ఇప్పుడు మాట్లాడేది.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తమ ప్రభుత్వం లాభాల బాట పట్టించిందని తెలిపారు. ఈ విషయంలో అభినందించాల్సిందిపోయి విమర్శిస్తారా అని నిలదీశారు. ఇంకా మాకు మూడేళ్ల సమయం ఉంది. ఆ తర్వాత కూడా తెలంగాణలో అధికారంలోకి రాబోయేది మేమే. అంటే మొత్తం 8 ఏళ్ల సమయం ఉంది. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే. అప్పుడు.. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *