డిజిటల్ మోసం నుంచి కాపాడిన పోలీసులు

– సైబర్ ఉచ్చు నుంచి బయటపడ్డ వృద్ధ వైద్యుడి కుటుంబం
– డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు ఉండవు
~ పోలీసుల స్పష్టీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 24: సీబీఐ అధికారులమని చెప్పుకొంటూ సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడిన ‘డిజిటల్ అరెస్టు’ ఉచ్చు నుంచి భద్రాచలం ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధ వైద్యుడి కుటుంబాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రక్షించారు. కొత్తగూడెం జిల్లాలోని డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డి నేషన్ సెంటర్ అధికారులు అత్యంత వేగంగా స్పందించి మూడు రోజులు కొనసాగిన
ఈ తీవ్రమైన మోసాన్ని అడ్డుకున్నారు. భద్రాచలంలో నీలా నర్సింగ్ హోమ్‌ నిర్వహిస్తున్న 80 ఏళ్ల డాక్టర్ బుద్ధరాజు సుబ్బరాజు, ఆయన కోడలు, మనవరాలు ఈ సైబర్ మోసానికి బాధితులయ్యారు. నవంబర్ 20, గురువారం రోజున డాక్టర్ సుబ్బరాజుకు సీబీఐ అధికారులమని చెప్పు కొనే వ్యక్తుల నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆయన ఆధార్ కార్డుతో ముంబైలో ఓ బ్యాంకు ఖాతా ఉందని, అది ఏకంగా 100కు పైగా క్రిమినల్ కేసులలో ఉపయోగించబడిందని అబద్దాలు చెప్పి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాక వారిని సీబీఐ పర్యవేక్షణలో ఉంచినట్లు హెచ్చరించి, ఎవరితోనూ మాట్లాడకూడదని, ప్రతి గంటకూ వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉండాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, ఎఫ్ఎలు, ఇంట్లో ఉన్న నగదు వివరాలను మోసగాళ్లు తీసుకున్నారు. ఎఫీలను వెంటనే రద్దు చేసి, ఆ డబ్బును వారికి పంపడానికి సిద్ధం కావాలని మూడు రోజులుగా నిరంతరం ఒత్తిడి చేశారు. ఈ కారణంగా ఆ కుటుంబం మూడు రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, ఇంట్లోనే ఉండిపోయింది. ఫోన్ ఎత్తకపోవడం, డాక్టర్ సుబ్బరాజు ఆసుపత్రికి రాకపోవడాన్ని గమనించిన ఆయన సహాయకుడు అనుమానం వ్యక్తం చేశాడు. పదేపదే ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ సహాయకుడు నవంబర్ 23 రాత్రి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డీఎస్పీ అశోక్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందరు ఆ రాత్రే డాక్టర్ సుబ్బరాజు ఇంటికి చేరుకున్నారు. వెంటనే మోసగాళ్లతో ఆ కుటుంబానికి ఉన్న సమస్యను అడ్డుకున్నారు. అధికారుల వేగవంతమైన చర్యల వల్ల ఆ కుటుంబానికి జరగాల్సిన పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం తప్పింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సమయోచితంగా స్పందించి వృద్ధుడి కుటుంబాన్ని రక్షించిన డీఎస్పీ అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్ ను అభినం దించారు. ప్రస్తుతం, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక దర్యాప్తును ప్రారంభించారు. మోసగాళ్ల ఐపి చిరునామాలు, కాల్ రూటింగ్ వివరాలు, పరికరాల గుర్తింపు సంఖ్యలను విశ్లేషిస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ సమన్వయం చేసుకుంటూ మోసగాళ్ల నెట్వర్స్ను ధ్వంసం చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పోలీసులు, సీబీఐ లేదా ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఎప్పుడూ ‘డిజిటల్ అరెస్టులు’ లేదా వాట్సాప్ విచారణలు చేయదని, చట్టంలో ఏ అధికారికి కూడా డబ్బును ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పే అధికారం లేదని స్పష్టం చేశారు. సైబర్ మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page