– రాత్రి వేళల్లో నడుచుకుంటూ కాలనీల్లో పర్యటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్ వాహనాల గస్తీకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ’మేమున్నం’ అనే భరోసా కల్పించే విధంగా ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. పెట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్ సిబ్బంది తమ వాహనాలను నిలిపివేసి ప్రజలతో మమేకమవుతూ జనసంచారం అధికంగా ఉండే ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్‌లు, నివాస కాలనీలు, చిన్న చిన్న వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.ప్రజల్లో భద్రతా భావనను పెంపొందించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, అనుమానితులను తనిఖీ చేయడమే లక్ష్యంగా ఈ ఫుట్ పెట్రోలింగ్‌ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల రాత్రివేళల్లో సామాన్య ప్రజల్లో ధైర్యం పెరగడమే కాక నేరస్థుల్లో భయం కలుగుతోంది. క్షేత్రస్థాయిలో స్థానికులతో నేరుగా సంభాషించడం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ, నేర నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల రక్షణెళి ధ్యేయంగా ఈ ఫుట్ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బ్లూ కోల్టస్, పెట్రోలింగ్ సిబ్బంది వాహనాలను పక్కన పెట్టి, మార్కెట్లు, బస్టాండ్‌లు మరియు నివాస ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని ఇరుకైన సందుల్లో కూడా పోలీసులు తిరగడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడుతోంది. రాత్రివేళల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నా రు. అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రివేళల్లో కారణం లేకుండా తిరిగేవారు, పాత నేరస్థుల వివరాల సేకరిస్తారు. నిర్మానుష్య ప్రాంతాలలో మద్యం సేవించే వారి కట్టడి, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పూనుకొంటారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు తనిఖీ చేస్తారు. ప్రజల మధ్య ఉండటం వల్ల పోలీసులపై ప్రజల్లో భరోసా భావం పెరుగుతుంది. స్థానికులతో స్నేహపూర్వకంగా ఉండడం వల్ల ఒక్కోసారి నేరాలకు సంబంధించిన ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంది. కొత్తంగా కాలినడక గస్తీ వల్ల ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం ద్వారా పోలీసులకు స్థానిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతోందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటం వల్ల ముఖ్య సమాచారం త్వరగా అందుకునే వీలుందన్నారు. ప్రజల భద్రత కేవలం పోలీసుల బాధ్యతే కాదు, పౌరుల సహకారం కూడా అంతే ముఖ్యం. పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెనుకాడకుండా పోలీసులకు సమాచారం అందించండి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయాల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఈ ఫుట్ ప్యాట్రోలింగ్ సరికొత్త ఒరవడిని సృష్టించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.