– వారికి కార్పొరేట్ వైద్యం దూరం చేస్తారా?
– కేవలం నిమ్స్ కే పరిమితం చేస్తారా?
– పోలీసుల ఆరోగ్య భద్రత గాల్లో దీపమైంది
– బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: పోలీసుల జీతాల నుండి ప్రతినెలా ఆరోగ్య భద్రత కోసం డబ్బులు కట్ చేసుకుంటున్న ప్రభుత్వం వారికి సేవలు అందించడంలో తీవ్ర వివక్ష చూపిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా విమర్శించారు. నిత్యం ప్రజల భద్రత కోసం కృషి చేసే పోలీసులకు కార్పొరేట్ హాస్పిటల్స్ ల్లో వైద్యాన్ని దూరం చేసి నిమ్స్ హాస్పిటల్ కే పరిమితం చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల సకాలంలో వైద్యం అందక పోలీసు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుకు గురైన ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావును ‘గోల్డెన్ అవర్’లో ఓ ప్రముఖ ప్రైవేటు దవాఖానకు తరలించినప్పటికీ పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు నిరాకరించడంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా పాలకులకు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. ఇది అత్యంత బాధాకరం, అమానవీయమన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారింది. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరవైన దిక్కుమాలని పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. ఆరోగ్య భద్రత పథకం లక్ష్యాన్ని నీరుగార్చుతుండటం హేయమన్నారు. మీ రక్షణ కోసం వేల మంది పోలీసులను వాడుకుంటూ వారి కనీస హక్కులను కాలరాయడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎన్నికలకు ముందు ఏక్ పోలీస్ వ్యవస్థ తెస్తామని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, హక్కుల కోసం రోడ్డెక్కిన పోలీసులనే అరెస్టు చేయించి జైలుపాలు చేయడం, సస్పెండ్ చేయడం మీ అహంకారానికి నిదర్శనం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. కపక్క వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.. మరోపక్క పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు, టీఏలు, స్టేషన్ అలవెన్సులు రాక మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులంటే మీకెందుకంత కక్ష అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న ఆరోగ్య భద్రత బకాయిలన్నీ చెల్లించి, నిమ్స్ తోపాటు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ల్లో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్, టీఏలు వెంటనే చెల్లించాలని, స్టేషన్ అలవెన్సులు నెలనెలా విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



