– కేంద్రం నిర్ణయంపై మంత్రి తుమ్మల హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి తాజాగా ప్రారంభమైన పీఎండీడీకేవైలో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర పథకాలతోపాటు ఈ పథకాన్ని పూర్తిగా అనుసంధానం చేస్తూ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ యూనివర్శిటీల భాగస్వామ్యంతో జిల్లాస్థాయిలో పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తామని, అలాగే డిజిటల్ మానిటరింగ్ ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.


