– సమస్యలపై చర్చకు ఎప్పుడూ సిద్దమే
– సభా సమయాల్లో డ్రామాలు వద్దు.
– విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు
న్యూదిల్లీ, డిసెంబర్ 1: బీహార్ పరాజయాన్ని కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సూచించారు. ఈమేరకు ప్రతిపక్ష ఇండి కూటమిపై నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ’సమావేశాలు సజావుగా ముందుకు సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి. సభా సమయాల్లో డ్రామాలు వద్దు. చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలి. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదు. మేము మాత్రం విపక్షాలను కలుపుకొని ముందుకెళ్తాం. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా మాతో కలిసి రావాలి. దేశ ప్రగతి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలి. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. విూ బాధ్యతను విూరు నిర్వర్తించండంటూ ఆయా పార్టీలకు ప్రధాని హితవు పలికారు. పార్లమెంటులో బలమైన అంశాలతోపాటు ప్రశ్నలు లేవనెత్తండంటూ వారికి కీలక సూచన చేశారు. తమ ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగలవద్దని కోరుతున్నానన్నారు. గత పదేళ్లుగా ప్రతిపక్షాలు ఆడుతున్న ఆట దేశ ప్రజలకు ఇక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారు తమ వ్యూహాన్ని మార్చుకోవాలి. వారికి కొన్ని టిప్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రధాని విపక్షాలకు చురకలంటించారు. జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈసారి పార్లమెంట్ సెషన్ కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు బాటలు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





