మ‌న ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

ట్రంప్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మోదీ పిలుపు
వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలో మోదీ ప‌ర్య‌ట‌న‌

వారణాసి, ఆగస్టు 2: భారత ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసి వ్యాఖ్యలను ప్రదాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌ పరుగులు పెడుతోందన్నారు. ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనల వేళ స్వదీశీ ఉత్పత్తులను పెంచాలని పిలుపునిచ్చారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో మోదీ శనివారం పర్యటించి దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం వంటి బహుళ రంగాలకు ఉపయోగపడతాయి. స్మార్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్ట్‌, విద్యుత్‌ మౌలిక సదుపాయాల భూగర్భీకరణ కింద వివిధ పనులకు పునాది వేశారు. వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది.. అన్ని దేశాలు తమ స్వప్రయోజనాలపైనే దృష్టిపెడుతున్నందున మనం కూడా మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అపసరం ఉంది.. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనపెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి అని పిలుపునిచ్చారు. కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనాలన్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలపైనా ప్రధాని మోదీ విమర్శిలు గుప్పించారు. కళ్లముందు అన్యాయం, ఉన్మాదం జరుగుతుంటే ఆ మహాదేవుడు తన రుద్రరూపాన్ని చూపిస్తాడు.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత రుద్ర రూపాన్ని ప్రపంచం చూసింది.. ’సిందూర్‌‘ ఆపరేషన్‌ విజయంతో పాక్‌ ఉగ్ర స్థావరాలు ధ్వంసమైతే కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మన భద్రతా దళాలను అవమానిస్తున్నాయి.. అసలు ఆపరేషన్‌ పేరు కూడా వారికి సమస్యగా మారింది.. అలా అనడం సిగ్గుచేటు అని మోదీ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జమ్ముకాశ్మీర్‌లో ఇటీవల పహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టిన ’ఆపరేషన్‌ మహాదేవ్‌’ గురించి ఆ మహాదేవుడి ఆశీస్సులతో పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోగలిగామని, అయితే ఈ ఆపరేషన్‌ జరిగిన సమయాన్ని కూడా అనుమానిస్తున్నారు.. ఉగ్రవాదులు దొరికినప్పుడు వారిని చంపకుండా వారాలు చూసుకోవాలా.. లేక వారు పారిపోయేందుకు అవకాశం ఇవ్వాలా అని మోదీ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *