– ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనను తోసిపుచ్చిన మోదీ
– ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకలకు బుద్ది చెప్పాం
– కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసిన త్రివిధ దళాలు
– ఆపరేషన్‌పై కాంగ్రెస్, విపక్షాల తీరు దారుణం
– హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తున్న వారికి ప్రజల్లో స్థానం లేదు
– లోక్‌సభలో ప్రధాని మోదీ
న్యూదిల్లీ, జూలై 29: పాక్‌తో కాల్పుల విరమణలో అమెరికా పాత్రను లోక్‌సభ వేదికగా ప్రధాని మోదీ తోసిపుచ్చారు. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఇదే సందర్భంలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్, విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం, భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలాలతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని తెలిపారు. ’ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో వాడీ వేడిగా జరిగిన చర్చకు సమాధానం గా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా మాకు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు. పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు చెప్పా. పాక్‌కు ఎవరు సాయం చేసినా.. చూస్తూ ఊరుకొనేది లేదని చెప్పాం. పాక్ ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటామని వాన్స్‌కు చెప్పాం. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్‌కు చెప్పాం. పాక్‌కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశాం. పాక్‌కు చిరకాలం గుర్తుండి పోయే సమాధానం ఇచ్చాం. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశామని అన్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా త్రివిధ ధళాలకు సంపూర్ణ స్వేఛ్ఛ నిచ్చామని మోదీ తెలిపారు. భారత సైన్యం పాక్‌లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిందని, ఊహలకు కూదా అందని విధంగా టెర్రరిస్టులను శిక్షించామని, ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను మట్టిలోనే కలిపేశామని అన్నారు. ఏప్రిల్ 22న కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాం దాడులు అన్నారు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని ప్రతినబూనాం. ద్రోహులకు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం. పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్ ఎయిర్ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. అణుబాంబులు బెదిరింపులు చెల్లవని పాక్‌ను హెచ్చరించాం. 193 దేశాల్లో 190 దేశాలు ఆపరేషన్ సిందూర్‌ని సమర్థించాయి. పాక్‌కు కేవలం మూడు దేశాలే అండగా నిలిచాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని,స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోంది. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు.తద్వారా సైన్యం మనోస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నారు. డియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు డియా హెడ్‌లైన్లలో ఉండొచ్చేమో గానీ.. ప్రజల మనస్సుల్ని గెలవలేరని అన్నారు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భాగ్యం. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు. పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కినప్పుడూ ఇలాగే మాట్లాడారు. పాక్ నుంచి అభినందన్‌ను మోదీ ఎలా తెస్తారో చూస్తామన్నారు. మేం ఆయన్ను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాం. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోంది. భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. నేనెప్పుడూ భారత ప్రజల పక్షమే. భారతీయుల భావనలతో నా స్వరం మిళితం చేసుకొని ముందుకెళ్తున్నా. ఆపరేషన్ సిందూర్ సమయంలో నాపై నమ్మకం ఉంచినందుకు దేశ ప్రజలకు రుణపడి ఉన్నానని మోడీ అన్నారు. పాకిస్థాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంని స్పష్టం చేశారు. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తాంఅని ప్రధాని మోదీ హెచ్చరించారు. పహల్గాం దాడి ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టామన్నారు. ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నట్లు చెప్పారు.





