జిహెచ్‌ఎం‌సి అభివృద్ధికి ప్రణాళికలు

– రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు
– మేడ్చెల్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మల్లారెడ్డి
– అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మున్సిపల్‌ ‌శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం రేవత్‌ ‌రెడ్డి ఓ ప్రణాళికను తీసుకున్నారని అన్నారు. అసెంబ్లీలోలో సభ్యులు అడిగిన ప్రశ్నల సందర్భంగా శ్రీధర్‌ ‌బాబు మున్సిపల్‌ ‌శాఖ అభివృద్ధికి సంబంధించిన విషయంపై మాట్లాడారు. జిహెచ్‌ఎం‌సి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు చేశామని, రూ. 122 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఎమ్మెల్యేలు చెప్పారని తెలియజేశారు. 2016 లో ఎస్‌ఆర్‌ ‌డిపిని తీసుకువచ్చారని, ట్రాఫిక్‌ ‌రద్దీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు. జవహర్‌ ‌నగర్‌ ‌ప్రాంతం తన గుండెకాయ అని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ‌చెత్త అంత అక్కడే వేస్తున్నారన్నారు. జవహర్‌ ‌నగర్‌ ‌డంపింగ్‌ ‌యార్డ్ ‌సమస్యపై ఆయన ప్రస్తావించారు. ఇన్‌ ‌చార్జి మంత్రి శ్రీధర్‌ బాబు అంటే తనకు చాలా అభిమానం అని తెలియజేశారు. చెత్త నుంచి విద్యుత్‌ ‌తయారీ ప్లాంట్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హయాంలో ఏర్పాటు చేశారని, మేడ్చల్‌ ‌నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారని విమర్శించారు. జవహర్‌ ‌నగర్‌ ‌చెత్తతో రెండున్నర లక్షల మంది అవస్థలు పడుతున్నారని, వాసన భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా అని అనిపిస్తుందని, తనపై కుట్ర పన్నుతున్నారని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మేడ్చల్‌ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. మేడ్చల్‌ ‌ప్రాంతాన్ని జీహెచ్‌ఎం‌సీ పరిధిలోకి తీసుకొచ్చారు కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మోరీలు, కరెంటు స్తంభాలు లేవు. జవహర్‌నగర్‌లో చెత్త కొండ పేరుకుపోతోంది. వాతావరణ కాలుష్యంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీధరన్నా కు దండం పెడతా. మాపై పగపట్టకండి. దయచేసి మేడ్చల్‌ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించండి‘ అని మల్లారెడ్డి కోరారు.  అలాగే గత పదేళ్లుగా రోడ్లు, డ్రైనేజీలు లేవని వ్యాఖ్యానించారు. దీనిపై శ్రీధర్‌ ‌బాబు స్పందించారు. నిజాలు చెప్పినందుకు మల్లారెడ్డిని అభినందించారు. గత పదేళ్లగా అభివృద్ది జరగలేదని తాము అంటున్నామని అన్నారు. ఇదిలావుంటే రేవంత్‌ ‌రెడ్డిని సీఎంని చేసింది తానేనని మల్లారెడ్డి అన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్‌ ‌తప్ప మరెవరూ పవర్‌ఫుల్‌ ‌నాయకుడు లేరని రెడ్డి సంఘం సమావేశంలో తానే చెప్పానని గుర్తుచేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ ‌చేశారు. ఎవరు అవునన్నా, కాదన్నా తాను, రేవంత్‌ అన్నదమ్ములమేనని చెప్పారు.

ఆదాయం సమకూరుస్తున్నా తెలంగాణపై చిన్నచూపే

రాష్ట్రం దేశ జిడిపిలో 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్రం నుంచి పన్ను వసూళ్ల రూపంలో రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రం పొందుతోంది. అయినా వివక్ష చూపడం అన్యాయమని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో ఆయన సిఎం రేవంత్ రెడ్డికి బదులుగా మున్సిపల్ శాఖకు సంబంధించి బీఆరెస్, బిజెపి సభ్యుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల పనులను వేటినీ రద్దు చేయలేదని శ్రీధర్ బాబు స్పష్టం చేసారు. కొన్ని చోట్ల స్వల్ప మార్పులు చేసినా పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వీటన్నటిని రూ.2,250 కోట్లతో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. బిఆరెస్ హయాంలో కొన్ని పనులు మొదలై అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేసిన విషయాన్ని ఆయన జ్ణాపకం చేసారు. ప్రాధాన్యత క్రమంలో అన్నిటిని పూర్తి చేస్తామని వివరించారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద పనులు 15 రోజుల్లో ప్రారంభమవుతాయి. బాచుపల్లి హెచ్ ఎండిఏ ఫ్లైఓవర్ పనులు మేనెల లోగా పూర్తి చేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తాం. లింక్ రోడ్లలో మార్పులు ఏమీ లేవు. కొన్ని పనులను రద్దు చేసామని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని బీఆరెఎస్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. మేడ్చల్- సుచిత్ర ఎలివేటెడ్ రోడ్డు పనుల కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్లాడు. దీనిపై సిఎం, రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నిధిన్ గడ్కరీని కలిసి త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాని కోరారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేస్తాం. అక్కడ కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. ప్యారడైజ్- శామీర్ పేట, ప్యారడైజ్- సుచిత్ర ప్రాజెక్టు పనులు కూడా టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. డిఫెన్సు భూముల బదలాయింపుకు సంబంధించిన సమస్యలపై సిఎం రేవంత్ రెడ్డి నాలుగుసార్లు కేంద్ర రక్షణ మంత్రిని కలిసి పరిష్కారానికి కృషి చేసారు. త్వరలో పనులు మొదలవుతాయి. హస్తినాపురం ఫ్లైఓవర్ ప్రతిపాదనపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది. తప్పకుండా చేపడతాం. మూసి ప్రక్షాళనతోపాటు తూర్పు- పడమర ప్రాంతాలను కలిపేలా భారీ రహదారులను చేపట్టే ప్రణాళికలు సిద్ధమయ్యాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. జంటనగరాలకు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరుగుతున్నాయి.. దానికి తగినట్టు మంచినీటి సరఫరా, రహదారులను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భారీ ఆకాశ హర్మ్యాలకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. అవన్నీ పూర్తయే దశకు చేరుకున్నాయి. అక్కడ ఆవాసాలు మొదలైతే పీక్ అవర్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు పనులను చేపడుతోందని వివరించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా మురుగనీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గతంలో మూసీ నదీ గర్భంలో ఎస్టీపీని ఏర్పాటు చేయడానికి శాంక్షన్లు ఇచ్చారు. సాంకేతికంగా ఇది పెద్ద పొరపాటు. దానిని మరో చోట ఏర్పటు చేస్తున్నాం. శుద్ది చేసిన జలాలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని శ్రీధర్ బాబు తెలిపారు.

ఏపితో సమానంగా నిధులు ఇప్పించాలి

అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు విడుదల అవడం సంతోషకరం. అదే స్థాయిలో నిధులను తీసుకురావాలని బిజెపి ఎంపీలను కోరుతున్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణాకు చిన్న చూపు ఎదురవుతోందని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న రాష్ట్రమయినా ఐదు శాతం జిడిపికి తోడ్పతున్న విషయాన్ని విస్మరించరాదని అన్నారు.

కొత్త పెళ్లి కొడుకు మల్లారెడ్డికి శుభాకాంక్షలు

మల్లారెడ్డి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. జీవితం గురించి వారికి తెలసినంతగా మరెవరికి తెలియదని మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మొన్ననే 50 వ వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్నారు. వారికి మా అభినందనలు. వారు కొత్త పెళ్లికొడుకు. అసత్యాలు చెప్పరని అనుకున్నాం. బయట ఉన్నదున్నట్టుగా మాట్లాడతారు. సభలోకి వచ్చన తర్వాత ముందు వెనక ఉన్నవారి ప్రభావంలో పడి సైడ్ ట్రాక్ అవుతుంటారు. ఆవేశపడుతుంటారు. రోడ్లు లేవు, డ్రెయిన్లు లేవు, నీళ్లులేవు అని అన్నారు. మీ పదేళ్లలో ఏం జరగలేదని చెప్పకనే చెప్పారు. మేం తప్పకుండా వారి ఆవేదనను అర్థం చేసుకుని ప్రజలకు అవసరమైన పనులన్నిటిని చేపడతాం. జవాహర్ నగర్ చెత్త వ్యర్థాల ఆధారంగా 48 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసారు. 20 ఏళ్ల కాలానికి ప్రణాళిక సిద్దం చేయాల్సి ఉండె. కానీ ఆవిధంగా జరగలేదు. దుర్వాసన సమస్యను తప్పకుండా పరిగణన లోకి తీసుకుంటాం. సిఎం రేవంత్ రెడ్డి మరో మూడు చోట్ల డంపింగ్ యార్డులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఒక్కచోటనే వ్యర్థాలను పడేయడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించాం. నూతన సాంకేతిక పరిజ్ణానంతో వ్యర్థాల సమస్యను పరిష్కరిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *