– రాష్ట్రంలో కేరళ మోడల్ అమలు
– అత్యంత పేదల గుర్తింపులో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలి
– జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు నూతన లక్ష్యంతో, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా ,శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు మహిళా సంఘాలు తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాయని, ఇకపై వారి బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ప్రజా భవన్‌లో సోమవారం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి జిల్లాల వారీగా గత నెల రోజులపాటు మహిళా సంఘాలు, సమాఖ్యలు నిర్వహించిన కార్యకలాపాలను ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కేరళ తరహాలో అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించడంలో గ్రామైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అత్యంత పేదరికంలో ఉన్న (పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ను) వారిని గుర్తించి వారిని ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో అత్యంత వెనుకబాటులో ఉన్న కుటుంబాలను గుర్తించి వారి అవసరాలను అర్థం చేసుకొని ప్రభుత్వానికి నివేదిస్తే వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు ఇప్పటివరకు అందని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘మీ పరిసరాల్లో, మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియజేస్తే ప్రభుత్వం తప్పకుండా వారిని ఆదుకుంటుందన్నారు. ఇందుకవసరమైన ప్రొఫార్మాను త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కేరళలో అత్యంత పేదరిక నిర్మూలన ఎలా చేపట్టారో మహిళా సంఘాలకు మంత్రి సీతక్క వివరించారు. అక్కడ సర్వే ద్వారా 64,006 అత్యంత పేద కుటుంబాల్లో సుమారు లక్షమంది తీవ్రమైన పేదరికంలో ఉన్నవారిగా గుర్తించారని చెప్పారు. ఆహారం, ఆరోగ్యం, జీవనోపాధి, గృహ నిర్మాణం వంటి అంశాలను ఆధారంగా తీసుకొని బతుకు కష్టంగా ఉన్న కుటుంబాలను అత్యంత పేదలుగా గుర్తించారని, ప్రతి కుటుంబానికి వేర్వేరు అవసరాలున్నాయని, అందు కోసం ప్రత్యేక మైక్రో ప్లాన్‌లను రూపొందించారని చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కూడా అత్యంత పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మైక్రో ప్లాన్ ను రూపొందిస్తామని, ఆయా కుటుంబాలకు కేరళ తరహాలో గుర్తింపు కార్డులు, ఇళ్లు, ఉపాధి అవకాశాలు, వైద్య సంరక్షణ వంటి సహాయాలను అందిస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చొరవతో అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను సమీకరించి ఈ లక్ష్యాన్ని కేరళ సాధించిందని, అదే తరహాలో మన రాష్ట్రంలో మహిళా సంఘాలు ముందుకొచ్చి అత్యంత పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైన సూర్యాపేట, వనపర్తి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, స్వరూపలను మంత్రి సీతక్క సన్మానించారు. మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నసెర్ప్ ను అభినందించారు. జిల్లా మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో కేక్ కట్ చేసి సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



