అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు

– పార‌ద‌ర్శ‌క విధానాల‌తో పెట్టుబ‌డులు
– అపోహ‌ల‌కు ఊత‌మిస్తే న‌ష్ట‌పోయేది మీరే
– మీరు పెట్టే పెట్టుబ‌డుల‌ను వ‌దులుకోం
-స‌మాజ హిత‌మే నా ల‌క్ష్యం
-ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

అపోహలు, అనుమానాలను దాటుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం సీఆర్ ఈడీఏఐ నిర్వ‌హించిన ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ప్రభుత్వం విధానం, నిర్మాణం రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివన్నారు. పాలకులు మారినా విధానాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం వ‌ల్ల‌నే  మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామ‌న్నారు.  పారదర్శక విధానాల‌తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామ‌న్నారు.  పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.  లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత త‌మ ప్ర‌భుత్వానిద‌న్నారు. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరేనన్నారు.  అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చాన‌న్నారు. ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామ‌ని ప్ర‌శ్నించారు. పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత అని స్ప‌ష్టం చేశారు. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని. కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు. సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా. అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చు. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదు. జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చింది. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు. అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేది.  జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ర‌వాణా స‌దుపాయం వుండాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాన‌న్నారు.  షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నామ‌న్నారు. మన నగరం ప్రతిష్ట పెంచడానికే మా ప్రయత్నం.  మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు. మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం దిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారని ప్ర‌శ్నించారు.  దిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. అది ఫామ్ హౌస్ లా వాడుకుని దావత్ లు చేసుకునేందుకు కాదని దెప్పి పొడిచారు.  రూ. 26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించా. అలా రూ. 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నా. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం. తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే.  రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నాం. వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా మౌలిక స‌దుపాయాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం.. త్వరలోనే అనుమతులు రాబోతున్నాయి. తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.  కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నాం. నీళ్ళుండే చోటుకు మనం వెళితే నీళ్లు ఎక్కడికి వెళతాయి? అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నాం. నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఒక పెద్దమనిషి సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.  దానికి మీరు మద్దతుగా నిలిస్తే మీకే నష్టం.  తెలంగాణ కోసం ప్రణాళికలు మేం సిద్ధం చేస్తాం.. మీరు ప్రమోట్ చేయండి. ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించారు, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు. వాళ్లు ఇక్కడ లేకపోయినా వారి పేర్లు చెప్పుకుంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నాం. సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరు.  నాకు వేరే కోరికలేం లేవు. హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. భవిష్యత్ లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, తపన ఉంది.  నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. భూమి ఒక సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను మీరు ఎంత పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తారనేదనిపైనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారపడి ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *