– నలుగురి మృతి
– ఉత్తర అరిజోనాలో ఘటన
ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అరిజోనాలోని(North Arizona) నవాజో నేషన్‌లో చిన్లే (chinley) మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక రోగిని తీసుకెళుతుండగా విమానంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన సీఎస్‌ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం ఫీనిక్స్‌కు ఈశాన్యంగా 300 మైళ్లు (483 కి.మీ) దూరంలో ఉన్న చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, జిల్లా పోలీసు కమాండర్ ఎమ్మెట్ యాజ్జీ తెలిపారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. విమాన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధకారమని నవజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. కాగా, జనవరిలో ఫిలడెల్ఫియాలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయి ఎనిమిదిమంది మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయడం లేదని తెలిపింది.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే