గోదావరి నీటితో మూసీ ప్రక్షాళనకు ప్రణాళిక

– మూడు నదుల సంగమంగా గాంధీ సరోవర్
–  గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్
– ఓల్డ్ సిటీ అభివృద్ధి, మత సామరస్యానికి కృషి
– కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది 
– మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి
– అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 2: మూసీ నది కాలుష్యానికి శాశ్వత పరిష్కారంగా గోదావరి నీటిని తీసుకువచ్చి ప్రక్షాళన చేపట్టనున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం శాసనసభలో ప్రకటించారు. బాపూ ఘాట్.. మూసా, ఈసా నదుల సంగమంలో మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చారిత్రక ప్ర‌దేశ‌మ‌ని, మూడు నదుల సంగమంగా మార్చి గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్చి 31కల్లా అంచనాలు, టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. 1908లో వ‌చ్చిన వరదలకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు న‌ర్మించిందని, ఇప్పటికీ అవి హైదరాబాద్ ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయని పేర్కొన్నారు. లండన్ థేమ్స్, న్యూయార్క్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ నగరాల్లో నదీ పరివాహకాలను కాపాడుకుని అభివృద్ధి చేశారని, ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయ‌ని సీఎం వివ‌రించారు. గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారు .. ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు బీజేపీ నాయకులు.. వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకున్నారు.. మేం వాటిని వ్యతిరేకించలేదు.. తప్పుపట్టడం లేదు అని అన్నారు. గుజరాత్ సబర్మతీ, ఉత్తరప్రదేశ్ గంగా రివర్ ఫ్రంట్‌ల స్ఫూర్తితో మూసీని మారుస్తామని వివ‌రించారు. ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌజుల డ్రైనేజీతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క‌లుషిత‌మ‌వుతుంటే ఉక్కుపాదం మోపాం. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాం. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, కంపెనీల కాలుష్యాలు, జంతు కళేబరాలు నదిలో కలుస్తున్నాయని, మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెప్పిన పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తామ‌ని చెప్పారు.

గోదావరి నీరు, 20 టీఎంసీ పంపిణీ

గోదావరి జలాలను 20 టీఎంసీ తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించారు. ఇందులో 15 టీఎంసీ తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీ మూసీలో నిరంతరం శుద్ధమైన నీరు పారించేందుకు ఉపయోగిస్తామని వివరించారు. బాపూ ఘాట్ వద్ద వి-షేప్‌లో అభివృద్ధి చేస్తామ‌ని, గాంధీ సరోవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏషియ‌న్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.4 వేల కోట్ల రుణానికి అంగీకారం తెలిపిందని, డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా అంగీకరించారని చెప్పారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నామ‌న్నారు. కన్సల్టెన్సీలను నియమించి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు.

ఓల్డ్ సిటీ అభివృద్ధి, మత సామరస్యం

ఓల్డ్ సిటీని నిర్లక్ష్యం చేయలేదని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంచిరేవుల దగ్గర పురాతన శివాలయం, మూసీ పరివాహకంలో గురుద్వార్, మసీదు, చర్చి నిర్మించి మత సామరస్యాన్ని చాటుతామని ప్రకటించారు. పట్టణీకరణ 20 ఏళ్లలో 75%కి చేరుతుందన్నారు. కొంతమంది నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు.. రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ అంటూ హైటెక్ సిటీ సమయంలో కూడా ఇలాంటి విమర్శలే చేశారని గుర్తు చేశారు.

కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది 

మూసీ ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు. మూసీ పరివాహక పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటే వారు అలాగే ఉండాలని విపక్షం ప్రవర్తిస్తోంది. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరం అంటూ ముఖ్య‌మంత్రి విమర్శించారు. దాన్ని తగ్గించుకుంటే మంచిది అని స‌ల‌హా ఇచ్చారు. నేను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారు.. నిజాలు ప్రజలకు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారు.. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు అని ప్ర‌శ్నించారు. డీపీఆర్ సిద్ధం అయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అందరి సలహాలు తీసుకుంటామని చెప్పారు.

ఎమ్మెల్యేలకు పిలుపు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి. పేదలకు మంచి ఇళ్లు కట్టించి మెరుగైన వసతులు కల్పిస్తాం అని సూచించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే త‌మ‌ సంకల్పం అని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *